మాజీ సీఎంకు మరో షాక్.. కూతురుకు ED నోటీసులు

by Muthe.Rajitha |

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.

మాజీ సీఎంకు మరో షాక్.. కూతురుకు ED నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. వీణకు చెందిన ఐటీ కంపెనీ 'ఎక్సాలాజిక్ సొల్యూషన్స్' (Exalogic Solutions) ఆర్థిక లావాదేవీలపై వస్తున్న మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. కాగా కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీ నుండి వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే సుమారు రూ.1.72 కోట్ల నుండి రూ.2.78 కోట్ల వరకు అక్రమంగా నిధులు బదిలీ అయ్యాయనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. కంపెనీల చట్టం (Companies Act) ఉల్లంఘనలతో పాటు అక్రమ ద్రవ్య చలామణి నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలతో జూన్ 12న కొచ్చిలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట హాజరు కావాలని వీణకు అధికారులు సమన్లు జారీ చేశారు.

ఈ కేసు దర్యాప్తును సవాలు చేస్తూ దాఖలైన సీఎంఆర్‌ఎల్ (CMRL) అప్పీల్‌ను ఇటీవల కేరళ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా, ఈడీ తన దర్యాప్తును యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టమైన తీర్పునిచ్చింది. కోర్టు అనుమతి లభించిన వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ విచారణలో భాగంగానే పినరయి విజయన్ నివాసంతో పాటు, వీణ నివాసం, CMRL కార్యాలయాల్లో ఈడీ ఇప్పటికే కీలక సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ జూన్ 12న జరిగే విచారణ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. అయితే ఈ కేసులో వీణతోపాటు మరో 9 మందికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.

Next Story