లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

మిర్యాలగూడ పట్టణంలో గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిగా పూర్తయ్యాయని, త్వరలో రాష్ట్ర మంత్రుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.

లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు : ఎమ్మెల్యే
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ పట్టణంలో గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిగా పూర్తయ్యాయని, త్వరలో రాష్ట్ర మంత్రుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాన్ని సందర్శించి నిర్మాణ పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప పథకం కింద మంజూరైన ఈ స్థలంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పేరుతో పలుమార్లు ప్రత్యేక నిధులు కేటాయించినప్పటికీ పనులను పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. ఎన్నికల ముందు తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేకుండానే డ్రా విధానం నిర్వహించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా నిరంతరం పర్యవేక్షిస్తూ మంత్రులు, అధికారుల సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఇక్కడ నివాసానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను పూర్తి చేసినట్లు తెలిపారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, విద్యుత్, తాగునీరు, అంతర్గత రహదారులు తదితర సౌకర్యాలను అధికారులు నాణ్యతతో పూర్తి చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరలోనే రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు గుడిపాటి నవీన్, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, సర్పంచ్ బెజ్జం సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story