అడ్డాలు పెట్టి పింఛన్లు పంచిన ప్రైవేట్ వ్యక్తి

by Disha Web |
అడ్డాలు పెట్టి పింఛన్లు పంచిన ప్రైవేట్ వ్యక్తి
X

దిశ, లక్షెట్టిపేట: సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారం లక్షెట్టిపేటలో గురువారం సాయంత్రం వివాదానికి దారి తీసింది. పలు వార్డుల్లో అడ్డాలు పెట్టి ఓ ప్రైవేటు వ్యక్తి లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు ఇస్తుండటంతో స్థానికుల్లో ఆగ్రహం తెప్పించింది. ఈ విషయాన్ని పలువురు స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సురేష్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. గత నెలకు సంబంధించిన పింఛన్లను లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 2016 చొప్పున ఇవ్వాల్సి ఉండగా, రూ.2 వేలు ఇచ్చి మిగతా రూ.16ని చొప్పున నొక్కేస్తున్నాడు. ప్రైవేటు వ్యక్తి కోర్టు ఏరియాలో పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నాడని తెలుసుకున్న ఆ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి పంపిణీని అడ్డుకున్నారు. అనారోగ్యంతో, మంచంలో నుంచి లేవలేని వికలాంగులకు గత మూడు నెలల నుంచి పింఛన్ అందలేదని పలువురు ఆరోపించారు. దీంతో సుమారు గంటసేపు ప్రైవేటు వ్యక్తిని పట్టుకుని అతడిని అక్కడి నుంచి కదలనివ్వలేదు. బ్రాంచ్ పోస్టుమాస్టర్ రాగానే ప్రైవేటు వ్యక్తినీ నియమించి పింఛన్లను పంపిణీ చేస్తూ ఒక్కొక్క లబ్ధిదారు నుంచి రూ.16 చొప్పున ఎందుకు నొక్కేస్తున్నారని ఆయనపై మండిపడ్డారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు వైస్ చైర్మన్ తెలిపారు.

Next Story