అధికారుల కనుసన్నల్లోనే అటవీ సంపద నాశనం

by Disha Web Desk 12 |
అధికారుల కనుసన్నల్లోనే అటవీ సంపద నాశనం
X

దిశ, కోటపల్లి : మండలంలోని బొప్పారం, ఆలుగామా , జనగామ, అరోయలపల్లి, నాగం పేట, అటవీ ప్రాంతాల్లో ఇసుక, మట్టి దందా జోరుగా సాగుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు ట్రాక్టర్లతో అక్రమంగా అటవీ సంపదను తీసుకెళ్తున్నారు. అడవిలో దొరికే కంకరను సైతం తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. ఇలా ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు అను నిత్యం ఇలాగే జరగడం వల్ల అటవీ సంపద అక్రమార్కుల చేతిలో నాశనం అవుతుందని చెప్పవచ్చు. ఈ ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అటవీ అధికారుల కనుసన్నల్లోనే..

ఇలా అక్రమంగా రోజు మట్టి, ఇసుక, కంకర తరలిపోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ముందుగానే అక్రమార్కులు అటవీ అధికారులతో చేయి కలిపి.. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్ కు రూ.2000 నుంచి రూ.3000 డిమాండ్ చేస్తూ వదిలేస్తూ ఉంటారు. అడవిలో దొరికే ఎర్రమట్టిని తరలించేందుకు అధికారులు చేతివాటం అందించడంతో అటవీ సంపద ఆవిరైపోతుంది.

వంట సరుకుకు రూ. 1000

గ్రామాలలో గ్యాస్ వాడకం తక్కువగా ఉంటుంది. తద్వారా ప్రజలు ఎండిపోయిన కర్రల కోసం అడవికి వెళతారు. దీనినే ఆదునుగా చూసుకొని గ్రామాల్లో ఒక్కో కుటుంబం దగ్గర నుండి రూ.1000 నుండి రూ.2000 వరకు బీట్ ఆఫీసర్ వసూలు చేసి.. వారికి పర్మిషన్ ఇస్తుంటారు. ఇలా ఒక్కో గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ఇదే తంతు. ఇలా ఎవరైతే ఇవ్వరో వారి ఎడ్ల బండ్లను అపి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఎవరైతే ముందే మాట్లాడుకొని ఆఫీసర్ కి ముడుపులు అప్పజెప్పుతారో వారివి మాత్రం వదిలేస్తుంటారు. ముడుపులు అప్పజెప్పని వారివి పట్టుకుని సీజ్ చేస్తూ, ఫైన్ వేస్తూ ఉంటారు.

ఇటీవల బొప్పారం అటవీ ప్రాంతంలో ఇసుక తీస్తున్న 3 ట్రాక్టర్ లను అటవీ అధికారులు పట్టుకొని వాటికి ఫైన్ వేశారు. ఈ విషయమై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు తమను డబ్బులు డిమాండ్ చేశారని, దానికి అంగీకరించకపోవడం వల్లే తమ వాహనాలు పట్టుకున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలా అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్నారని సంబంధిత అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.



Next Story

Most Viewed