విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం

by Jakkula.Mamatha |

జనగామ జిల్లా ఘనపూర్(స్టేషన్) నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో మంగళవారం విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం
X

దిశ, జనగామ: జనగామ జిల్లా ఘనపూర్(స్టేషన్) నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో మంగళవారం విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపనతో పాటు నిర్మాణం పూర్తి చేసుకున్న సబ్‌స్టేషన్లు, 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. కార్యక్రమానికి ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షత వహించగా, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ పనుల ద్వారా మొత్తం 60,838 మంది వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా వేలేరు మండలం పీచరలో రూ.43.92 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే కొండాపూర్, సాగరం, కుర్చపల్లి గ్రామాల్లో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్లను ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

అదే విధంగా పల్లగుట్ట, లింగంపల్లి, నష్కల్ గ్రామాల్లో రూ.9.66 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడి రైతులు, గృహ వినియోగదారులు, చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయించిన రైతు సేవా కేంద్రం స్టాల్‌ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించగా, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమం కొనసాగింది. పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story