వైసీపీ పాలనలో వ్యవసాయానికి అగ్రతాంబూలం.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

by Disha Web |
వైసీపీ పాలనలో వ్యవసాయానికి అగ్రతాంబూలం.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రైతులకు అవసరమైన సేవలన్నీ ఒకేచోట అందిస్తోన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాంలో శుక్రవారం ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారుల పాత్ర లేకుండా చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం రైతులకు భరోసాను ఇస్తోంది. వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో విత్తనాల కోసం ఎరువుల కోసం చివరకు క్రిమి సంహారక మందులు కొనుగోలు చేయాలన్నా ఎన్నో కష్టనష్టాలు పడే వారు. నేడు వైసీపీ ప్రభుత్వం వాటన్నింటిని ఒకే చోటికి తీసుకు వచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు సులువుగా అందేలా చేసాం. అంతేకాకుండా యంత్ర పరికరాలు కూడా అద్దె ప్రాతిపదికపై ఇస్తున్నాం. అలాగే రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అందచేస్తున్నాం అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

రెండు పంటలకు సాగునీరు

మరోవైపు నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో సచివాలయ భవనాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్న ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఒక్కరు నుంచి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదంటే జగన్ పాలన ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందడం లేదని ముందుకు వస్తే తక్షణమే వారికి మంజూరు చేస్తాం. జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఏడాదికి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు గాను జలయజ్ఞం కింద ఈ ఏడాది చివరికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంకల్పించాం అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ సర్పంచ్ రాపర్తి ఎరుకవాడు, ఎంపిటిసి రూవ్వ వాసుదేవరావు, జడ్పిటిసి చింతు అన్నపూర్ణ రామారావు, ఎంపీపీ ఆరంగి మురళీధర్, నరసన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోన్నాన దాలి నాయుడు, పి ఏ సి ఎస్ సురంగి నర్సింగరావు, అధ్యక్షులు స్థానిక వంశధార పేపర్ మిల్ ఎండి రాజేంద్ర, రాజాపు అప్పన్న, చీపురు కృష్ణమూర్తి, కోరాడ చంద్రభూషణ్ గుప్త, బి.ఈశ్వరరావు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మరియు ఎంపీడీవో రవికుమార్, వ్యవసాయ శాఖ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed