పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం అవసరం: ఐరాసలో భారత ప్రతినిధి

by Dishafeatures2 |
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం అవసరం: ఐరాసలో భారత ప్రతినిధి
X

యునైటెడ్ నేషన్స్: అనునిత్యం సంఘర్షణలు చోటు చేసుకుంటున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రత్యక్ష శాంతి సంప్రదింపులు అత్యంత ఆవశ్యకమని ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతినిధి నొక్కి చెప్పారు. వెస్ట్ బ్యాంక్, జెరూసలెం, గాజా ప్రాంతాల్లో తాజా పరిణామాల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో మంగళవారం ఐరాసలోని భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్. రవీంద్ర పాలస్తీనా సమస్య అనే అంశంపై ప్రసంగించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి ప్రక్రియని అడ్డుకునే చర్యలను సహించబోమంటూ ఐరాస భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం బలమైన సందేశం పంపించాలని ఆయన పేర్కొన్నారు. పాలస్తీనా కుటుంబాలను చట్టబద్దంగా మాసాఫెర్ యాట్టా నుంచి పంపించడంలో ఎదురవుతున్న ఉద్రిక్తతలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.

పాలస్తీనా, ఇజ్రాయెల్ భూభాగాల్లో విధ్వంసక చర్యలు, పరస్పరం రెచ్చగొట్టుకునే చర్యలు నేటికీ కొనసాగుతున్నాయని, ఐక్యరాజ్య సమితి ఇలాంటి హింసాత్మక, ప్రతీకార దాడులను నిరంతరం ఖండిస్తూనే వస్తోందని రవీంద్ర గుర్తు చేశారు. హింసాత్మక చర్యలను పూర్తిగా ఆపివేయడం, ఇరుదేశాల మధ్య యధాతథ స్థితికి భంగం కలిగించే ఏకపక్ష చర్యలకు తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలమధ్య పరిష్కర సాధనకు ఇరుదేశాలూ నేరుగా శాంతి చర్చలు జరుపుకోవడం ఒక్కటే ఉత్తమ మార్గమని ఐరాసలో భారత రాయబారి రవీంద్ర స్పష్టంచేశారు. పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలు, ఇజ్రాయెల్‌కి సంబంధించి భద్రతా పరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే దిశగా ఈ చర్చలను నిర్వహించాలని పేర్కొన్నారు. పాలస్తీనా సార్వభౌమాధికార, స్వతంత్ర దేశ ప్రతిపత్తిని భారత్ ఎప్పుడూ గౌరవిస్తోందని చెప్పారు. అదే సమయంలో గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా వాసులకు వర్క్ పర్మిట్లను మరింతగా పెంచే దిశగా ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలు కూడా ప్రశసనీయమని ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed