రౌడీషీటర్‌పై కేసు ఎందుకు పెట్టలేదు...? పోలీస్ ఉన్నతాధికారులు ఆరా

by Dishafeatures2 |
రౌడీషీటర్‌పై కేసు ఎందుకు పెట్టలేదు...? పోలీస్ ఉన్నతాధికారులు ఆరా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తల్వార్లతో రౌడీ షీటర్ల హంగామా వ్యవహారంపై పోలీసులు సత్వరమే స్పందించలేదా..? డీవీఆర్ తీసుకొచ్చినా చర్యలకు ఎందుకు వెనుకాడారు..? అన్న ప్రశ్నలపైనే చర్చలు సాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురవుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా వారిని కట్టడి చేయడంలో వైఫల్యానికి కారణాలేంటీ అన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

డీవీఆర్ బాక్స్ తీసుకొచ్చినా..

బైపాస్ రోడ్డులోని దాభా హోటల్ వద్ద జరిగిన ఈ గొడవ గురించి సమాచారం అందగానే వన్ టౌన్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దాభా హోటల్‌లోని డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) బాక్స్ తీసుకొచ్చినా తెల్లవారే సరికి సీన్ అంతా మారిపోయింది. హంగామా సృష్టించి, తల్వార్‌తో దాడి చేసినా ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మధ్యాహ్నం వరకు ఈ విషయం అంతా గప్ చుప్ అయిపోందని అనుకున్నారంతా. ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీసిన తర్వాత కూడా కేసు నమోదు చేయకుండా మిన్నకుండి పోవడానికి కారణాలేంటన్నదే అంతుచిక్కకుండా తయారైంది.

ఒత్తిళ్ల కారణంగా వీరు రౌడీషీటర్ గ్యాంగ్‌పై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్న చర్చే ప్రధానంగా సాగుతోంది. అనూహ్యంగా కరీంనగర్ సీపీ సత్యనారాయణకు ఇన్‌ఫర్మేషన్ రావడంతో పోలీసులు అలెర్ట్ కావల్సి వచ్చింది. గురువారం రాత్రి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

దాదాపు 12 గంటల వరకు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎందుకు మిన్నకుండి పోయారన్నదే మిస్టరీగా మారిపోయింది. ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న కారణాలేంటన్న విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయిస్తున్నట్టు సమాచారం. రౌడీ షీటర్ల వ్యవహారాన్ని కట్టడి చేయకపోతే శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా విస్మరించడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్ టు కరీంనగర్

రౌడీ షీటర్ లవణ్ హైదరాబాద్‌లో ఉంటున్నాడని పోలీసులు చెప్తున్నప్పటికీ తరుచూ కరీంనగర్‌కు వస్తూ పోతున్నాడన్న ప్రచారం ఉంది. కరీంనగర్‌లో తన గ్యాంగ్ మెంబర్స్ ద్వారా సెటిల్ మెంట్లు, ఇతరాత్ర వ్యవహారాల్లో తల దూర్చుతున్నట్టు బాహాటంగానే అంటున్నారు. ఇటీవల కాలంలో లవణ్ గ్యాంగ్ హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు వస్తూ పోతుంటున్నారని తెలుస్తోంది. గతంలో కరీంనగర్‌లో తల్వార్‌లతో హంగామా సృష్టించిన లవణ్‌పై ఓపెన్ చేసిన రౌడీ షీట్‌ను సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

ఆయన సొంత ఊరు వేములవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఉందన్న కారణంతో రౌడీ షీట్‌ను అక్కడకు బదిలీ చేశారని సమాచారం. కేసులు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉంటే రౌడీ షీట్ మాత్రం సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటో అప్పటి అధికారులకే తెలియాలి. ఒకరిద్దరు పోలీసు అధికారుల అండదండలు ఉన్నాయని కూడా లవణ్ గ్యాంగ్ ప్రచారం చేసుకుంటుండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారు.

గురువారం దాభా హోటల్ వద్ద జరిగిన గొడవతో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కరీంనగర్‌లో లవణ్‌కు తిరుగులేదని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కథ అడ్డం తిరిగింది అన్న రీతిలో సీపీ సత్యనారాయణకు సమాచారం వచ్చింది. దాంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో లవణ్ గ్యాంగ్ చేప్పుకున్నదంతా వట్టిదేనని తేలింది.

పరారీలో లవణ్..

గురువారం తెల్లవారుజామున తమ కళ్లెదుటే ఉన్న లవణ్‌ను పోలీసులు పట్టుకోకుండా వదిలేశారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులపై ఏ అధికారి ఒత్తిళ్లు ఉన్నాయో లేక ఇతరాత్ర కారణాలేంటో కానీ గ్యాంగ్‌ను వదిలేయడంతో వారిని వెతికి పట్టుకోవల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. సీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసి లవణ్ గ్యాంగ్ కోసం గాలింపు మొదలు పెట్టారు. అయితే ఈ గ్యాంగ్‌లో కొంతమందిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నప్పటికీ మెయిన్ లీడర్ లవణ్ ఆచూకి దొరకనట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed