నల్లగొండ డీఆర్‌డీఏలో అవినీతి..? అక్రమంగా కోట్ల సంపాదన

by Disha Web |
నల్లగొండ డీఆర్‌డీఏలో అవినీతి..? అక్రమంగా కోట్ల సంపాదన
X

దిశ, నల్లగొండ: డీఆర్డీఏ నల్లగొండ పీడీపై రెండు రోజులుగా 'దిశ' లో వచ్చిన కథనాలతో సెర్ప్, ఈజీఎస్‌లో పనిచేసే ప్రతి ఉద్యోగి తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో పెద్ద స్థాయి అధికారిని ఎదిరిస్తే తన ఉద్యోగం ఎక్కడ పోతుందో నన్న భయంతో ఎన్ని వేధింపులైనా సరే కుటుంబసభ్యులను గుర్తుతెచ్చుకొని మిన్నకుండిపోయారు. 'దిశ' వరుస కథనాలతో ఆమె ద్వారా నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. వరుస కథనాలు ప్రచురిస్తున్న ఓ రాజకీయ నేత, యూనియన్ లీడర్లు ఆమెను కాపాడుతున్నారని జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. ఆ అధికారికి సంబంధించిన ఉన్నతాధికారుల వర్గంలో కొంతమందికి ఆమె చెప్పు చేతుల్లోనే ఉంటుంది. వారి నుంచి గుట్టుచప్పుడు కాకుండా ముడుపులు పుచ్చుకుంటుంది. ఈ తతంగమంతా అందరికీ తెలిసినా తమ ఉద్యోగ భద్రత కోసం మిన్నకుండిపోతున్నారు.

అద్దె కార్ల దందా.. ప్రైవేట్ డ్రైవర్ల గోస..

జిల్లాలోని 32 మండలాల్లో ఎంపీడీవోలకు, ఈజీఎస్‌లో మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గంలో పనిచేసే నలుగురు ఏపీడీలు, సామాజిక తనిఖీలు, ఇతర ఉన్నతాధికారులకు ప్రభుత్వం అద్దెకార్లను సమకూరుస్తోంది. దీనికి ఎల్లో నెంబర్ ప్లేట్ మాత్రమే వాడాలి. అదికూడా నిరుద్యోగులు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, సబ్సిడీ, లోన్‌ల ద్వారా తీసుకున్న కార్లను ప్రభుత్వాధికారులు అద్దెకు తీసుకోవాలి. కానీ, వారు మాత్రం సొంత వాహనాలను బినామీ పేర్లతో అద్దెకు నడుపుతున్నారు. వారంతా నెలకు రూ.33 వేల బిల్లులు తీసుకుంటూ అటు ప్రభుత్వాన్ని, ఇటు నిరుద్యోగులను మోసం చేస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. లాగ్ బుక్‌లో రీడింగ్, పర్యటన వివరాలు మాత్రం కరెక్టుగానే ఉంటాయి.

అన్ని రికార్డులు కరెక్టుగానే సక్రమంగా నమోదు చేస్తారు. ఈ తతంగమంతా డీఆర్డీఏ పీడీకి తెలిసే జరుగుతుంది. బిల్లులు మంజూరు చేసేది పీడీనే కావడంతో ఆమెకు ప్రతి అద్దె కారు నుంచి రూ.2వేల వరకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఈ తతంగం పై ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తే డీఆర్డీఏ లో జరిగే అవినీతి బాగోతమంతా బయటపడుతుందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రైవేట్ టాక్సీ యాజమానులు కూడా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

15 ఏండ్లుగా అక్కడే తిష్ట..

డీఆర్డీఏ కార్యాలయంలో ఓ అధికారి 15 ఏండ్లుగా అక్కడే తిష్ట వేసినట్లు సమాచారం. డీఆర్డీఏ కు పీడీగా ఏ అధికారి వచ్చినా ఆయనే మధ్యవర్తి. దాదాపుగా ఆయనతో మాట్లాడితే పీడీ తో మాట్లాడినట్టే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలకు పాలిథిన్ కవర్లు సప్లయ్ చేయాలంటే టెండర్ నోటీసు ఇచ్చి నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వాలి. కానీ డీఆర్డీఏలో తిష్టవేసి కూర్చున్న ఆ పెద్దమనిషినే నిబంధనలకు విరుద్ధంగా పాలిథిన్ కవర్లు సప్లై చేస్తున్నారు. దీనికి వెనుక ఎవరున్నారు.. పెద్ద సీటు దగ్గరికి ఎంత కమిషన్ పోతుందో చెప్పక్కర్లేదు. ఈయనతోపాటు అందులో పనిచేసే మరో వ్యక్తి కోట్లు సంపాదించినట్లు సమాచారం. వాటర్ షెడ్ క్లస్టర్ నకిరేకల్, దేవరకొండ, మునుగోడు క్లస్టర్ లో చెక్ డ్యాం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గత పీడీ పనులను ఆపారు. ఆ పనులకు బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారు. దీనికి ఆ డిపార్ట్ మెంట్‌లో పాతుకుపోయిన ఓ అధికారి చక్రం తిప్పినట్లు సమాచారం. దీనికి బహుమతిగా రూ.10లక్షలతో పీడీ పాత ఇంటిని మరమ్మతులు చేశారని ఆ శాఖలోని ఉద్యోగస్తుల్లో అప్పట్లో చర్చ జరిగింది.

ప్రైవేట్ బ్యాంకులోకి ఐకేపీ కమిషన్..

2018 నుండి 21 వరకు ఐకేపీ సెంటర్లకు రావాల్సిన కమిషన్ రూ.10 నుంచి రూ.12 కోట్లు ఈ మధ్యకాలంలో మంజూరయ్యాయి. వాటిని సంఘ బంధాలకు, మండల సమాఖ్యలకు, జిల్లా సమాఖ్యలకు పంచాలి. నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ బ్యాంకులో జమ చేశారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని లావాదేవీలు కలెక్టరేట్‌లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ నుంచే చేయాలి. డీఆర్డీఏ కార్యాలయం లావాదేవీలు చేయడానికి అదే బ్రాంచిలో దాదాపు 10 ఖాతాలు ఉన్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బ్రాంచిలో అంత మొత్తం డబ్బులు జమ చేయడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

'ఆర్టీఐ'.. తర్వాత ఏం జరిగిందంటే

డీఆర్డీఏ లో జరుగుతున్న అక్రమాలను వెలికి తీయడానికి ఆర్టీఐ ద్వారా ఓ వ్యక్తి సమాచారం కోరాడు. అందులో ఉన్నదాని ప్రకారం పీడీ ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తిని నైట్ వాచ్‌మెన్‌గా చూపించి డీఆర్డీఏ ద్వారా జీతం ఇప్పిస్తూ అవినీతికి పాల్పడ్డారు. కానీ, ఆర్టీఐ వేసిన నాటి నుంచి ఆ వ్యక్తిని ఇంటి పనులు మానిపించినట్లు తెలిసింది. కాగా, ఈ అవినీతి తెలిసిన ఓ వ్యక్తిని తాత్కాలిక ఉద్యోగం నుంచి తప్పించినట్లు సమాచారం.. కా గా, సమాచార శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి కూ డా ఆర్టీఐ ద్వారా సరైన సమాచారం ఇవ్వలేదని వాపోయాడు.

అవినీతి పై కొరవడిన నిఘా..

జిల్లా కేంద్రంలో విసిరేసినట్లు ఉంటే డీఆర్డీఏ కార్యాలయంపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా కొరవడింది. అవినీతికి పాల్పడుతున్న, ఉద్యోగులు వేధింపులకు గురవుతున్న ఉన్నతాధికారులకు పట్టింపులేదు. డీఆర్డీఏ పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణకు ఆదేశించిన ఆలస్యమవడానికి కారణాలు తెలియడం లేదు. వివిధ శాఖలలో పనిచేసే సిబ్బంది వేధింపులకు గురవుతూ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అవినీతి అధికారులు రాజకీయ అండతో తప్పించుకుంటున్నారు. రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇప్పటికైనా అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ తనిఖీలు చేసి చట్టపరంగా శిక్ష విధించాలని కిందిస్థాయి సిబ్బంది వేడుకుంటున్నారు..

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed