వైసీపీలో కరోనా కలకలం

by Dishanational1 |
వైసీపీలో కరోనా కలకలం
X

దిశ, ఏపీ బ్యూరో : దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడటం టెన్షన్ పెట్టిస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కడంతో ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లోనే తిరగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారిలో కొందరు కరోనా బారినపడటం కలకలం రేపుతుంది. ఇకపోతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, అనుబంధ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు జిల్లాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తమకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇకపోతే వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతేకాదు ప్లీనరీ సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఏర్పాట్లను సైతం పరిశీలించారు. దీంతో వీరికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిలో టెన్షన్ నెలకొంది

హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఇటీవలే పంజాబ్‌లోని మెుహలీ ఐఎస్‌బీ క్యాంపస్‌లో క్లాసులకు వెళ్లి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అక్కడ వైద్యం చేయించుకున్న అనంతరం వంశీ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఏఐజీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు సైతం చేయించుకున్నారు. అయితే ఆ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుచరులకు తెలియజేశారు.


Next Story