భారత్‌లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆ 7 రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

by Disha Web Desk 19 |
భారత్‌లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆ 7 రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు అధికమవుతున్నాయని కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణతో సహా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. తెలంగాణలో రోజువారి సగటు కేసుల సంఖ్య పెరుగుతోందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత నెలలో రోజుకు సగటున 678 కేసులు నమోదు అవుతుంటే ఆగస్టు 5న అత్యధికంగా 1,061 కొత్త కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన వారంతో పోల్చితే ఈ వారంలో రోజువారీ కొత్త కేసుల్లో 1.28 శాతం పెరుగుదల కనిపిస్తోందని హెచ్చరించింది. గడిచిన వారంలో సగటున రోజువారి కేసులో 712 నమోదు అయితే ఆగస్టు 5 వరకు ముగిసిన వారంలో రోజువారి సగటు కేసులు 908కి పెరిగినట్లు తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేసుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర స్థాయిలో అధిక చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం ఉటంకించింది. తెలంగాణలోని 12 జిల్లాల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్య తగ్గుతోందని, మరో 4 జిల్లాల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు లేఖలో పేర్కొంది.

రాబోయే నెలల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగే వివిధ ఉత్సవాల సందర్భంలో సామూహిక సమావేశాలు జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెద్ద సంఖ్యలో వ్యక్తులు అంతర్రాష్ట్ర ప్రయాణాలు, ఒకే ప్రదేశాలలో సమావేశాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంలో కరోనాతో పాటు ఇతర అంటు వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అలర్ట్ చేసింది. ఏదైనా ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి సారించాలని, మార్కెట్‌లు, అంతర్ రాష్ట్ర బస్టాండ్‌లు, పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్‌లు మొదలైన రద్దీగా ఉండే ప్రదేశాలలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. 'కొవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్' కింద అన్ని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లలో అర్హత ఉన్న 18 ఏళ్లకు పై బడిన వారందరికి టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రం గత 6 నెలల నుండి కొవిడ్-19 ఇండియా పోర్టల్‌లో కొవిడ్ -19 హాట్‌స్పాట్ ఫారమ్‌ను పూరించలేదని పేర్కొంది. లోపాలను వేగంగా పరిష్కరించడం చాలా అవసరమని, డేటాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని పేర్కొంది.


Next Story

Most Viewed