'హస్తాని'కి అక్కడ అభ్యర్థులు కరువు.. ఆ ఒక్కరు ఎవరు..?

by Disha Web |
హస్తానికి అక్కడ అభ్యర్థులు కరువు.. ఆ ఒక్కరు ఎవరు..?
X

దిశ, శేరిలింగంపల్లి: ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్‌ఎస్ గ్రాండ్ వెల్కంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. మధ్యలో కాంగ్రెస్ నాయకుల మాటల యుద్ధంతో వర్షాకాలంలోనూ పొలిటికల్ హీట్ కాక రేపుతోంది. ఇంత జరుగుతున్నా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌లో మాత్రం ఉలుకూపలుకు లేదు సరికదా కనీసం వచ్చిన అవకాశాలనైనా అందిపుచ్చుకునే లీడర్ కరువైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందంటే ఆశ్చర్యమే. ఇంత పెద్ద నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఒక్క లీడర్ కూడా లేకపోవడం, ఉన్న ఒకరిద్దరికి అంత పట్టు లేకపోవడం పెద్ద మైనస్సే. అయితే తెలంగాణలో అన్ని జిల్లాల మీద దృష్టిపెట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం మీద మాత్రం కనీసం ఫోకస్ చేయకపోవడం వెనక అసలు రీజన్ ఏమై ఉంటుందో తెలియక ఆపార్టీ శ్రేణులు, అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కావాలనే పట్టించుకోవడం లేదా..? ఇక్కడ ఉన్నవారిని పూర్తిగా డమ్మీ చేసి కొత్తవారిని ఇక్కడి నుండి పోటీ చేయించేందుకే ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

యూత్ కాంగ్రెస్ హవా..

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా యూత్ కాంగ్రెస్ మాత్రం యాక్టివ్‌గా పనిచేస్తోంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా యూత్ లీడర్లు వాటిని భుజానికెత్తుకుని సక్సెస్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల విషయంలోనూ వారు ముందుండి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న అగ్నిపథ్ పథకాన్నీ వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో తమ గళం వినిపించారు. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు. ఇలా ప్రతీ విషయంలోనూ తమదైన శైలిలో నిరసనలు, ఆందోళనలు చేస్తూ.. యూత్ కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేస్తున్నారు.

హస్తంలో ఆ ఒక్కరు ఎవరు..?

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్పీడ్ పెంచింది బీజేపీ పార్టీ. ఎప్పటికప్పుడు చేరికలు చేపడుతూ పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే త్వరలో మరిన్ని చేరికలకు అవకాశం ఉన్నట్లు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్న క్యాడర్ ను కూడా కాపాడుకోలేక పోతోంది. చేరికల విషయం పక్కన పెడితే. ఖాళీ కాకుండా చూసుకునేందుకు సైతం ఎవరూ లేకపోవడం ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. అడపాదడపా ఒకరిద్దరు నేతలు పార్టీ కార్యక్రమాలు అంటూ హడావుడి చేస్తున్నా క్షేత్రస్థాయిలో వారికి అంత సీన్ లేదని ఆపార్టీ శ్రేణులే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో తామున్నామని చెప్పుకుంటున్న నాయకులకు జనాల్లో తగిన గుర్తింపు లేదని, చాలా వరకు వారెవరో కూడా పెద్దగా తెలియదని, ఏ ఒక్క డివిజన్ పై అవగాహన లేదని, ప్రజా సమస్యలు తెలియని వారు నాయకులు ఎలా అవుతారంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్‌లోని ఇంకొందరు నాయకులు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు అనే నాయకుడే లేడని, ఆ ఒక్క నాయకుడు ఎవరో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నాయి.

ఎవరో రావాలి.. ఏదో చేయాలి..

రానున్న ఎన్నికల్లో నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు కూడా అభ్యర్థులు ఎవరో అని వెతుక్కోవాల్సిన పరిస్థితులు తలెత్తడంతో పలువురు ఇతర నియోజకవర్గ నాయకులు శేరిలింగంపల్లిపై దృష్టి సారిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఓ సీనియర్ నాయకుడు తాను శేరిలింగంపల్లిలో పోటీకి దిగితే ఎలా ఉంటుందని కొందరు పార్టీ సీనియర్లను, ప్రెస్ వారిని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో నాయకుడు కూడా ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్నారు. పలు డివిజన్లలో ఆయన ఇప్పటికే సర్వే నిర్వహిస్తుండడం గమనార్హం. ఇలా పక్క నియోజకవర్గ నాయకులు ఇక్కడ దృష్టి పెడుతున్నా, స్థానిక నాయకుల్లో మాత్రం ఉలుకూపలుకు లేకుండా ఉండడం హస్తం పార్టీకి రిక్త హస్తాలే దిక్కన్న టాక్ వినిపిస్తోంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed