ఒకరు ఇన్​.. నలుగురు ఔట్​.. టీ కాంగ్రెస్‌ నుంచి నేతలు జంప్

by Disha Web |
ఒకరు ఇన్​.. నలుగురు ఔట్​.. టీ కాంగ్రెస్‌ నుంచి నేతలు జంప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హస్తం బేజార్​ అవుతోంది. పార్టీలోకి కొత్తోళ్ల చేరికలు, గతంలో పార్టీ మారి ఇప్పుడు మళ్లీ ఘర్​ వాపసీలో భాగంగా తిరిగివస్తున్న వారితో సమీకరణాలు మారుతున్నాయి. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి నిర్ణయాలు కూడా పార్టీ నేతలకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. పాత వారిని పొమ్మనలేక పొగ పెడుతున్నారంటూ నేతలు భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కొంత పట్టున్న ప్రాంతాల్లోనే కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. దీంతో కాంగ్రెస్​ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి వచ్చే వారి కంటే వెళ్లేవారి జాబితానే ఎక్కువగా ఉంటోంది. ఇదే సమయంలో బీజేపీ దూకుడు హస్తానికి తలనొప్పిగా మారింది. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ముఖ్య నేతలు పార్టీని వీడగా.. త్వరలో మరికొంతమంది కూడా అదే వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణంగా ఆయా నియోజకవర్గాల్లో కొత్త వర్గాన్ని రేవంత్​ రెడ్డి ఎంకరేజ్​ చేస్తున్నారనే ఆరోపణలే.

ఒకరు ఇన్​.. నలుగురు ఔట్​

కాంగ్రెస్​ లో చేరికలు కలిసి రావడం లేదు. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తే పార్టీ బలపడుతుందని భావిస్తే.. వచ్చేవారి సంగతి పక్కన పెడితే ఇన్నేండ్లు పార్టీని బతికించిన వారంతా బయటకు వెళ్తున్నారు. ఇక నుంచి తమ పార్టీలోకి చేరికల తుఫాన్​ వస్తుందని కాంగ్రెస్​ నేతలు ప్రకటించేలోపే ఇక్కడి నుంచే ఇతర పార్టీలోకి చేరికలు జరిగిపోతున్నాయి. వారిని ఆపేందుకు రాష్ట్రస్థాయి నేతలు ఎంతోకొంత ప్రయత్నాలు చేస్తున్నా.. సఫలం కావడం లేదు. ఇప్పటికే మునుగోడు సమస్య రేవంత్​ కు చుట్టుకుంది. చావో.. రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాజగోపాల్​ రెడ్డి రాజీనామాతో పార్టీలోని సీనియర్లకు సాకు దొరికింది. ఇది సాగుతున్న సమయంలోనే రాజగోపాల్​ రెడ్డి సోదరుడు ఎంపీ వెంకట్​ రెడ్డి స్వరం పెంచారు. ఢిల్లీలో కలిసి ఉన్నట్టే కనిపించినా.. రేవంత్​ అంటేనే ఒంటికాలిపై లేస్తున్నారు. ఇప్పుడు అదే జిల్లా నుంచి తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ కాంగ్రెస్​ లో చేరడం మరింత ఆజ్యం పోసింది. గతంలోనూ ఒకరిద్దరు జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలు చేరినా.. కాంగ్రెస్​ నుంచి బయటకు వెళ్లే నేతలు మాత్రం కొంత మేరకు సీనియర్లు, రాష్ట్రస్థాయి నేతలు కావడం విశేషం.

ఇంకెందరు..?

కాంగ్రెస్​ ను వీడుతున్న వారంతా ప్రధానంగా రేవంత్​ రెడ్డిపైనే ఆరోపణలు చేస్తున్నారు. సంబంధిత పరిస్థితులు కూడా రేవంత్​ కు వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి రాజీనామా సందర్భంగా టీపీసీసీ చీఫ్​ ను తూర్పారబట్టారు. బ్లాక్​ మెయిలర్​ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ కూడా రాజీనామా చేశారు. ఖైరతాబాద్​ నియోజకవర్గంలో ఏడాది నుంచి రోహిన్​ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చిన రేవంత్​.. శ్రవణ్​ కు చెక్​ పెట్టినట్లుగా చేశారు. ఇదే సమయంలో పీజేఆర్​ కుమార్తె, కార్పొరేటర్​ విజయారెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. దీంతో ఇక్కడ మూడు వర్గాలుగా మారిపోయింది. ఏండ్ల నుంచి పార్టీని నడిపిస్తున్న శ్రవణ్​ తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడారు. తనకు ప్రయార్టీ లేకుండా రెండు వర్గాలను ఎంకరేజ్​ చేస్తున్నారంటూ విమర్శించారు.

మరోవైపు ఇటీవలే హుస్నాబాద్ సెగ్మెంట్​ లోనూ గతంలో కాంగ్రెస్​ ను వీడిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్​ రెడ్డి తిరిగి కాంగ్రెస్​కు వచ్చారు. దీంతో ఈ సెగ్మెంట్​ ఇంచార్జిగా ఉన్న బొమ్మా శ్రీరాం చక్రవర్తి సైతం అలకబూనారు. ఇదే అదునుగా బీజేపీ అయనకు దృష్టి వేసింది. రేవంత్​ తీరుతో విసుగుతున్న శ్రీరాం వర్గం.. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అటు ఉమ్మడి వరంగల్​ లోనూ అదే పరిస్థితి నెలకొంది. వరంగల్​ వెస్ట్​ నుంచి ముందు నుంచీ నాయిని రాజేందర్​ రెడ్డి పోటీ పడుతుండగా.. పలుమార్లు ఆయనకు ఉత్తిచేయి చూపిస్తున్నారు. తాజాగా జనగామ డీసీసీ చీఫ్​ జంగా రాఘవరెడ్డి సైతం అక్కడే కన్నేశారు. ఇదే సమయంలో రేవంత్​ రెడ్డి మాజీ మేయర్​ ఎర్రబెల్లి స్వర్ణను ఎంకరేజ్​ చేస్తున్నారు. రాజేందర్​ రెడ్డిని పొన్నాల టీంగా, రాఘవరెడ్డిని ఉత్తమ్​ టీంగా ముద్ర వేసిన రేవంత్​ వర్గం.. ఇప్పుడు డీసీసీ పీఠంపై ఎర్రబెల్లి స్వర్ణను కూర్చుండబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో మిగిలిన రెండు వర్గాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. మరోవైపు వరంగల్​ తూర్పులోనూ కొండా సురేఖ ఇప్పటికే రెండుసార్లు పోటీ చేశారు. తాజా పరిణామాల్లో టీడీపీ నుంచి తనతో చేరిన వేం నరేందర్​ రెడ్డిని అదే సెగ్మెంట్​ లో పోటీకి దింపాలనే ప్లాన్​ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం. దీంతో కొండా వర్గం కూడా దూరమవుతుందనే అభిప్రాయాలున్నాయి.

మరోవైపు జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య వరుసగా పోటీ చేస్తున్నారు. తాజాగా రేవంత్​ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొమ్మూరి ప్రతాప్​ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు ఖమ్మంలో భట్టికి వ్యతిరేకంగా రేణుకా చౌదరికి పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన తాటి వెంకటేశ్వర్లును అశ్వరావుపేటలో పోటీ చేసేందుకు ప్లాన్​ చేస్తుండగా.. అక్కడి స్థానిక వర్గం మాత్రం వ్యతిరేకిస్తోంది. దీంతో లోకల్​ నేతలు పార్టీని వీడేందుకు సైతం సిద్ధమంటున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో కూడా ప్రేంసాగర్​ తో పాటు పలువురు ఇతర పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఒదెలు, జెడ్పీ చైర్​ పర్సన్​ భాగ్యలక్ష్మీని పార్టీకి తీసుకువచ్చారు. దీంతో గతంలో ఉన్న నేతలు బీజేపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్​ లో ఏలేటీ వర్గాన్ని, నిజామాబాద్​ లో మధుయాష్కీ వర్గాన్ని రేవంత్​ రెడ్డి తొక్కి పెడుతున్నాడనే ఆరోపణలున్నాయి. కరీంనగర్​ లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ ను సైలెంట్​ చేసిన రేవంత్​ టీం.. ఈసారి ఎంపీగా జీవన్​ రెడ్డిని దింపాలనే వ్యూహం చేస్తోంది. దీంతో బండి సంజయ్​ కి చాలా మంది టచ్​ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అటు పెద్దపల్లిలోనూ రేవంత్​ తో పార్టీలో చేరిన విజయరమణారావును అల్రెడీ ప్రకటించుకున్నారు. దీంతో డీసీసీ చీప్​ ఈర్ల కొంరయ్య వర్గం అన్​ హ్యాపీలో ఉంది. దీంతో సెగ్మెంట్లలో పాత వర్గం ఉండగానే.. కొత్తగా రేవంత్​ మరో టీంను దింపుతుండటంతో పాత నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అటు పాలమూరులోని జడ్చర్లలో ఎర్రశేఖర్​ ను పార్టీలోకి తీసుకువచ్చి చిచ్చు పెట్టారు.

ఎందుకు మాట్లాడటం లేదు

కాంగ్రెస్​ లోకి చేరికలు ఉంటే.. స్థానిక నేతలతో మాట్లాడాలని, వారితో చర్చించాలని పార్టీ సీనియర్లు పదేపదే చెప్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన చింతన్​ శిబిరంలోనూ ఇదే తీర్మానం చేశామని సీఎల్పీ నేత భట్టి స్వయంగా ప్రకటించారు. కానీ, చేరికల సందర్భంగా పాత నేతలకు కనీసం సమాచారం ఇవ్వడం లేదు. ఇటీవల ఖైరతాబాద్​ లో విజయారెడ్డి, హుస్నాబాద్​ లో ప్రవీణ్​ రెడ్డి చేరడం తమకు కనీస సమాచారం లేదని శ్రవణ్​, బొమ్మా శ్రీరాం చక్రవర్తి.. ఏఐసీసీ నేతలతో మొర పెట్టుకున్నారు. కానీ, దానిపై ఎక్కడి నుంచి రిప్లై రాలేదు. ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతలు రావడం ఒక పక్కన ఉంటే.. ఏండ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారిని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. దీంతో పార్టీ మారడమే శరణ్యమనే నిర్ణయానికి వస్తున్నారు.

వెంకట్​ రెడ్డి అంశంలో డైలమా

తాజాగా నల్గొండ జిల్లా రాజకీయాల్లో మళ్లీ వివాదం మొదలైంది. చెరుకు సుధాకర్​ పార్టీని కాంగ్రెస్​ లో విలీనం చేయడంతో వెంకటరెడ్డి ఫైర్​ అయ్యారు. తాను పీసీసీ చీఫ్​ ముఖం చూడనంటూ ప్రకటించారు. దీంతో ఆయన పార్టీలో ఉంటారా.. లేదా అనేది అనుమానంగా మారింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed