TPCC చీఫ్‌గా ఏడాది పూర్తి.. సంవత్సరంలో రేవంత్ సాధించిందేంటి?

by Disha Web Desk 2 |
TPCC చీఫ్‌గా ఏడాది పూర్తి.. సంవత్సరంలో రేవంత్ సాధించిందేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ అనుముల రేవంత్ రెడ్డి. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే స్టేట్ లీడర్‌గా ఓ ఫైర్ బ్రాండ్‌గా ముద్ర తెచ్చుకున్నారు. విషయం ఏదైనా దూకుడుగా వెళ్లడం రేవంత్ రెడ్డి మ్యానరిజమే ఇప్పుడు ఆయన్ను తెలంగాణ రాజకీయాల్లో ముఖ్య నేతగా ఎదిగేలా చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై పదునైన విమర్శల చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని ఆకర్షించిన రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఎదిగిపోయారు. నిస్సారంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డే ఆశాకిరణంగా కనిపించడంతో ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డిని 2021 జూన్ 26న టీపీసీసీ చీఫ్‌గా నియమించారు. శుభమూహుర్తం చూసుకుని జూలై 7న గాంధీ భవన్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీగా బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తి అవుతోంది. ఈ సంత్సరం కాలంలో అనేక ఆటుపోట్లను చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంలో టీపీసీసీగా రేవంత్ సక్సెస్ అయ్యారా? లేక చతికిల పడ్డారా? అంటే..

టీఆర్ఎస్ పై సింహా గర్జన:

టీపీసీసీగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సభ ద్వారానే తన లక్ష్యం ఏంటో పార్టీ శ్రేణులు, తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి సోనియమ్మ రాజ్యాన్ని స్థాపిస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే కదన రంగంలోకి దూకిన రేవంత్ రెడ్డి తొలి అడుగుతోనే సంచలనం రేపారు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పేరుతో ఇంద్రవెళ్లిలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించి తన సత్తా ఎంటో పార్టీకి, ప్రభుత్వాని చాటి చెప్పాడు. టీఆర్ఎస్, కేసీఆర్‌పై వాగ్బాణాలు సంధించారు. ఆ తర్వాత సభను వ్యూహత్మకంగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్వహించి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను తనవైపు తిప్పుకోగలిగారు. వరుస ఓటములతో నిరుత్సాహంతో ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌ను తిరిగి ఉత్తేజం కలిగించేలా వరుస కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో పార్టీ నిత్యం ఉండేంలా ఉద్యమాలు, పోరాటాలకు రూపకల్పన చేసుకుంటూ వస్తున్నారు. నిరుద్యోగ జంగ్ సైరన్, రచ్చబండ, మన ఊరు -మన పోరు, వరి పోరు, ధరణిపై దీక్షతో ప్రజా సమస్యలపై టీఆర్ఎస్‌ను తూర్పారబట్టడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.

రాహుల్‌ను రాష్ట్రానికి రప్పించడంలో సక్సెస్:

2014, 2018 వరుస పరాజయాలతో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడిపోయాయి. గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నా వారిని అడ్డుకోవడంలో రాష్ట్ర నేతలు విఫలం కావడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. పార్టీ తిరిగి పుంజుకుంటుందా? అనే అనుమానాలు హార్డ్ కోర్ కార్యకర్తలకు సైతం అనిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల నుండి ఇప్పుడు రాష్ట్ర రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ ముఖ్యమైన పాత్రగా మారింది. దీనికి ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తునన వ్యూహాత్మక నిర్ణయాలే కారణం అవుతున్నాయనే వారు ఉన్నారు. ముఖ్యంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని వరంగల్ సభకు తీసుకురావడం, ఆ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. టీఆర్ఎస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రాహుల్ గాంధీ చేత తిప్పికొట్టించడమే కాకుండా తాము అధికారంలోకొస్తే ఏం చేయబోతున్నామో చెప్పించగలగడంలో రేవంత్ తనదైన ముద్రవేసుకున్నారు. ఈ సభ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ కార్యక్రమాలపై మరింత ఫోకస్ పెట్టడం మొదలు పెట్టాయి అంటే ఆ ఎఫెక్ట్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చేరికలతో చెడుగుడు:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ బలోపేతం దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ బలాబలాలను అంచనా వేసుకుని చేరికలపై దూకుడు పెంచాడు. 'నీవు నేర్పిన విధ్యే నిరజాక్షా' అన్నట్లుగా ఎలా అయితే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీర్ఎస్‌లో చేర్చుకుని హస్తం పార్టీకి దెబ్బ కొట్టాడో అదే చేరికల ద్వారా టీఆర్ఎస్ అంతు చూస్తానంటూ చేరికలు గేట్లు తెరిచారు రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీలకు డిఫెన్స్‌లో పడేసినంత పని చేస్తున్నాడు. అయితే తనదైన పని తీరుతో పార్టీలోని కార్యకర్తలను, ప్రజలను మెప్పించగలుగుతున్న రేవంత్ రెడ్డికి ఇంటిపోరు తప్పడం లేదు.

ఏడాది అవుతున్నా సీనియర్లతో తగ్గని గ్యాప్:

రేవంత్ రెడ్డికి టీపీసీసీగా బాధ్యతలు ఇవ్వడంపై మొదటి నుండి కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత అధిష్టానం నిర్ణయం కాబట్టి ఎదురు చెప్పవద్దని కొంత కాలం సద్దుమణిగినా సందర్భం వచ్చిన ప్రతిసారి రేవంత్‌కు సీనియర్లకు మధ్య గ్యాప్ బహిర్గతం అవుతూనే ఉంది. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నాడని, సీనియర్లను కలుపుకుపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో వెంకట్ రెడ్డి ఇటీవల రేవంత్‌తో కలిసి వస్తున్నా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం అయిపోయారు. వీహెచ్, జగ్గారెడ్డి వంటి అగ్రనేతలు రేవంత్ తీరుపై భగ్గుమంటూనే ఉన్నారు. ఇటీవల చేరికల విషయంలో రేవంత్ తీరు సీనియర్ల ఆగ్రహానికి కారణం అవుతోంది. తమను సంప్రదించకుండానే తమ నియోజకవర్గాలకు చెందిన నేతలను పార్టీ కండువాలు కప్పుడం ఏమీ బాగోలేదని బహిరంగంగానే తూలనాడుతున్నారు. డీసీసీల విషయంలోనూ రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి.

నోటి దురుసుతో అబాసుపాలు:

పదునైన మాటలతో విరుచుకుపడే రేవంత్ రెడ్డికి నోటిదురుసు అబాసు పాలు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ నేతలపై ఘాటైన విమర్శలు చేసే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఆయనకు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల రెడ్లపై ఆయన చేసిన కామెంట్స్ పై సొంత పార్టీ నేతల నుండి కూడా విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ధరణి పోరాటంపై నిన్నటికి నిన్న మాట్లాడిన రేవంత్.. కేసీఆర్‌ను నోట్ల కట్టలతో కాల్చినా ఇంకా డబ్బులు మిగిలి ఉంటాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాయి. ఇవన్నీ సొంత పార్టీ నేతలకే వెగటుగలిగేలా ఉన్నాయనే టాక్ ఉంది.

మొత్తంగా ఏడాది కాలంలో అనేక ప్రజా ఉద్యమాలను రూపొందించిన రేవంత్ రెడ్డి పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావడంలో సఫలీకృతుడయ్యారనే మంచి మార్కులు పార్టీ అధిష్టానం వద్ద కొట్టేశాడు. అందుకే సీనియర్లు ఎంత కాదన్నా ఏఐసీసీ మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అసమ్మతి నేతలను అదుపులో ఉండాలని హెచ్చరిస్తోంది. త్వరలో మరోసారి రాహుల్ సభకు లైన్ క్లీయర్ అవ్వడానికి రేవంత్ రెడ్డి పనితీరుపై అధిష్టానం నమ్మకం ఉంచిందనే టాక్ ఉంది. ఎన్నికలకు ముందు ఎంత హడావుడి చేసినా దాని ఫలితం ఎన్నికల్లో కనిపించాల్సిందే. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే నేతల మధ్య సయోధ్య లేకుండా అధి సాధ్యం అయ్యే పని కాదు. సీనియర్ల ఆమోదం లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం అంటే అది ముళ్లబాటలో ప్రయాణమే అవుతుంది. సో.. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకుని అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి ఏడాది పదవి కాలం మూడు గొడవలు.. ఆరు వివాదాలుగా సాగిందనే టాక్ వినిపిస్తోంది.


Next Story

Most Viewed