యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి కామన్​ బోర్డు.. 15 వర్సిటీల్లో అమలు

by Dishafeatures2 |
యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి కామన్​ బోర్డు.. 15 వర్సిటీల్లో అమలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇష్టానుసారంగా ఏ యూనివర్సిటీ పరిధిలో వారే నియామకం చేసుకునే పద్దతికి బ్రేక్​ వేసింది. గతంలో విశ్వ విద్యాలయాల్లో భర్తీ చేసిన ఉద్యోగాల అంశంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఓ యూనివర్సిటీ వీసీపై నిరుద్యోగులు ఏకంగా దాడి చేశారు. హైదరాబాద్​ నడిబొడ్డున దాడి చేసి, రోడ్డుపై పరుగెత్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి బోర్డు ఏర్పాటు చేసింది. మెడికల్‌ వర్సిటీలు మినహా 15 వర్సిటీల్లో ఖాళీల భర్తీకి బోర్డు ఏర్పాటైంది. బోర్డు అధ్యక్షుడిగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌, కన్వీనర్‌గా కళాశాల విద్యా కమిషనర్​, సభ్యులుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కమిటీ సిఫారసు

యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సుదీర్ఘమైన కసరత్తు చేశారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ, తెలుగు, పాలమూరు, శాతవాహన, అంబేద్కర్, మహాత్మాగాంధీ, జేఎస్ఎఫ్ఎయూ, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, అటవీ, ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయాల్లో నియామకాలను కామన్ బోర్డు చేపట్టనుంది. యూనివర్సిటీల్లో ప్రస్తుతం 3,500 బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటిదాకా యూనివర్సిటీలే వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టే విధానం అమల్లో ఉంది. దీంతో నియామక ప్రక్రియలో అవినీతి, ఆరోపణలతో పాటుగా, ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానం అమలు చేయడంతో చాలా సమస్యలు వస్తున్నాయని, కోర్టు కేసులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులను పరిశీలించిన మంత్రి వర్గం.. కామన్ బోర్డును ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 12న నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం గురువారం కామన్​ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో 16 జారీ చేసింది. బోర్డు నిర్వహణ ఖర్చులను ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీల నుంచి సేకరించి బోర్డుకు కేటాయిస్తుంది. బోర్డు విధి విధానాలు, నియామక ప్రక్రియ నిబంధనలను త్వరలో ఖరారు చేయనున్నారు. బోర్డు విధి విధానాలు, నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలి? తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. ప్రస్తుతానికి భర్తీ చేయాల్సిన 3,500 ఉద్యోగాలను కామన్ బోర్డు ద్వారానే చేపట్టనున్నారు.


Next Story