- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా కాంగ్రెస్‌లో కోల్డ్ వార్.. బర్త్డే ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కోమటిరెడ్డి ఫొటో!
నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు మొదలయ్యాయి.

దిశ, నల్లగొండ బ్యూరో: నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు చాప కింద నీరులా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంటిపోరు నేటితో మరింత బహిర్గతం అయింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మంత్రికి మధ్య మొదటి నుంచి పొసగడం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గున మంటలు మండే పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు వారి మధ్య దూరం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. విషయం ఫ్లెక్సీ వేతతో మరోసారి రుజువయింది.
డీసీసీ ఎంపిక నాటి నుంచి..
డీసీసీ అధ్యక్షులుగా పున్న కైలాష్ నేత ఎన్నికైన నాటి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తనను తీవ్ర పదజాలంతో దూషించాడని, వ్యక్తిగత విషయాలతో కూడా విమర్శలు చేశారని పేర్కొంటూ తొలగించాలని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కైలాస్ నేత తను ఆశీర్వదించాలని మంత్రి కోమటిరెడ్డి ఇంటికి వెళితే ఏ మాత్రం పట్టించుకోకుండానే పంపించి వేశారని సమాచారం. నాటి నుంచి నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా కైలాస్ నేతకు ఆహ్వానం అందడం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా నల్లగొండలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అలాంటి సమయంలో కూడా డిసిసి అధ్యక్షుడికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. జిల్లాలో ఉన్న ఆరు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో శాసనసభ్యులతో సత్సంబంధాలు కైలాష్ నేత కలిగి ఉన్నారని సమాచారం.
కానీ కేవలం నల్గొండ శాసనసభ్యులు మంత్రి కోమటిరెడ్డి తోనే వైరం కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డిసిసి అధ్యక్షులు బి ఫామ్ లు సంతకం చేసి ఇవ్వాలి. ఆ బీఫాములను తీసుకోవడానికి కూడా కనీసం మంత్రి అనుచరులు వెళ్లకుండా ఓ సామాన్య కార్యకర్తను పంపించి తెప్పించుకున్నారని సమాచారం. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాల అమలు కూడా పిలుపుంటుంది. కానీ నల్గొండ నియోజకవర్గంలో ఇతర మంత్రులు విచ్చేసినప్పుడు తప్ప మిగతా సమయాల్లో డిసిసి అధ్యక్షులకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇలాంటి పరిస్థితులు కైలాసనేత కూడా నల్గొండ నియోజకవర్గంలో మంత్రితో సంబంధం లేకుండానే తన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఫ్లెక్సీల చించివేత..
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో నల్గొండ శాసనసభ్యులు, రోడ్లు భవనాల , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో మినహాయించి జిల్లా రాష్ట్ర నాయకులు అందరి ఫోటోలు ఉన్నాయి. దీంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించి పడేశారు. దీంతో మరోసారి మంత్రి కోమటిరెడ్డి, అధ్యక్షులు పున్న కైలాస్ నేత మధ్య ఉన్న వైరం బహిర్గతమైంది. ఆ ఫ్లెక్సీలను చించి వేయాల్సిన అవసరం కోమటిరెడ్డి అనుచరులకు తప్ప మరొకరికి అవసరం ఉండదని చర్చ జరుగుతుంది. మంత్రి అనుచరులు గా ఉన్న నాయకులు కావాలనే ఇలాంటి చర్యలకు తమ కార్యకర్తలను ఉసిగొలిపినట్లు చర్చ జరుగుతుంది..
బలహీన వర్గాల బిడ్డపై ఎందుకు ఈ కక్ష..
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా తెలంగాణ ఉద్యమకారుడు, ఉన్నత విద్యావంతుడు పున్న కైలాష్ నేత బలహీన వర్గాల బిడ్డకు పదవి దక్కితే ఎందుకు ఇంత కక్ష కడుతున్నారని చర్చ సాగుతోంది. ఓట్ల కోసమైతే బలహీన వర్గాల ప్రజల అవసరం.. కానీ పదవులు మాత్రం ఒకటి లేదా రెండు సామాజిక వర్గాలకు మాత్రమే దక్కాలని అనుకుంటే అది నియంత పోకడ తప్ప వేరే కాదని బలహీన వర్గాల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన బలహీన వర్గాల నాయకులను ఎదగనీయకుండా అణచివేసిన సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మరోసారి అదే ప్రయత్నం, అణచివేత కొనసాగించాలని చూడడం భావ్యం కాదన్న మాట వినిపిస్తోంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అగ్రవర్ణాలే ఈ జిల్లాను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని, అలాంటి వాళ్లు కనీసం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మించలేదు కానీ.. కుట్రలు కుతంత్రాలు చేస్తూ అవమానిస్తున్నారని బలహీన వర్గాల బిడ్డలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.






