CM KCR: కేంద్రంపై కేసీఆర్ యుద్ధం.. రేపు ఎంపీలతో కీలక భేటీ

by Disha Web |
CM KCR to Chair  TRS Parliamentary Meeting in Pragathi Bhavan Tomorrow for Rainy Session
X

దిశ, తెలంగాణ బ్యూరో: CM KCR to Chair TRS Parliamentary Meeting in Pragathi Bhavan Tomorrow for Rainy Session| పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన విధివిధానాలపై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిందిగా వారికి సూచించనున్నారు. ఇందుకోసం కొన్ని అంశాలను కూడా ఇప్పటికే పార్టీ అధినాయకత్వం సిద్ధం చేసింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే పార్టీ నుంచి సమాచారం వెళ్ళింది.

పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తే అంశాలు ఇవే :

= తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనను ప్రకటించాలి. పార్లమెంటు వేదికగా పోరాటానికి పూనుకోవాలి.

= ఆర్ధికంగా క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి బదులుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడానికి కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతూ ఉభయ సభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి.

= వ్యవసాయం, సాగునీరు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యాచరణతో అంచనాలను మించి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ముందంజలో తెలంగాణ నిలిచింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి.

= గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలి. తెలంగాణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్పగా అమలు జరుగుతున్న తీరు గురించి, రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ ఆడిట్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించింది, అవార్డులు ఇచ్చింది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట మార్చి విరుద్దంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ కుట్రపూరిత ధోరణులపై పార్లమెంటు వేదికగా నిలదీయాలి.

= ఆర్థిక రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలతో రోజురోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నది. ఆర్థిక వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షీణిస్తున్న రూపాయి విలువే అందుకు నిదర్శనం. దేశ డెవలప్‌మెంట్ ఇండెక్స్ పాతాళానికి చేరుకుంటున్నది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా తెలంగాణ ప్రజలకున్నది. అందులో భాగంగా ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా రూపాయి పతనంపై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలి.

= పాలనలో, రాజకీయ, సామాజిక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్య ధోరణి కారణంగా దేశంలో ప్రజాస్వామిక విలువలు దిగజారుతున్నాయి. పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం ఫరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలుతున్నది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ స్పూర్తికి, సెక్యులర్ జీవన విధానానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. దీనికి నిరసనగా పార్లమెంటును వేదికగా చేసుకుని దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పాలి.

= కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా, కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకుపోవాలి. కేంద్రం మెడలు వంచి ప్రజాస్వామిక విలువలను కాపాడాల్సి వున్నది. యావత్తు దేశ ప్రజల తరఫున టీఆర్ఎస్ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను నిలదీయాలి.

ఇది కూడా చదవండి: ఎంపీ అర్వింద్‌ను అడ్డుకున్న ఎర్దండి గ్రామస్తులు (వీడియో)

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed