CM KCR: రెవెన్యూ సదస్సు వాయిదా.. సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం

by Disha Web Desk 4 |
CM KCR Announces Revenue Conference Postponed
X

దిశ, తెలంగాణ బ్యూరో: CM KCR Announces Revenue Conference Postponed| రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నెల 15న నిర్వహించాలనుకున్న రెవెన్యూ సదస్సును వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. వర్షాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నందున జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తదనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే రంగంలోకి దిగి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి తాజా పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే తాను కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వరదలు వచ్చే చోట, ముంపు ఏర్పడే ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లను అవసరానికి తగినట్లుగా రంగంలోకి దించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని చోట్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణలోనూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసిన దృష్ట్యా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ సహా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను తాను కూడా సమీక్షిస్తూ ఉంటానని, ఒకటి రెండురోజుల్లో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించనున్నానని తెలిపారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా వారివారి నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని, రక్షణ చర్యల్లో పాలుపంచుకోవాలని, ప్రజలకు సాయపడాలని, నష్టాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా లోకల్‌గానే ఉండాలన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు కూడా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి విజ్జప్తి చేశారు.గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున భారీ వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.



Next Story