బలిపశువుగా మంత్రివర్గం.. జగన్ నాటకంలో ఇదో భాగం: టీడీపీ

by Dishafeatures2 |
బలిపశువుగా మంత్రివర్గం.. జగన్ నాటకంలో ఇదో భాగం: టీడీపీ
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌కు తన కేబినెట్‌ మార్చుకునే హక్కు, అధికారం ఉంది. కానీ జగన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. ధరల పెరుగుదల, విద్యుత్ కోతలు, ఆర్థిక సంక్షోభం, సహజ వనరులను కబళింపు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు లాంటి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఏమాత్రం దోహదం చేయదని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం ఎప్పుడో అవినీతి బురదలో కూరుకుపోయింది. వైసీపీని రాజకీయ బురద, అవినీతి, పతనం నుంచి బయటపడేసేందుకు కూడా మంత్రివర్గ పునర్నిమాణం ఏ మాత్రం కలిసిరాదంటూ ఎద్దేవా చేశారు.

మంత్రివర్గాన్ని బలిపశువును చేస్తున్నారు

ప్రజల దృష్టిని మరల్చడానికే మంత్రుల నుంచి జగన్ రాజీనామాల డ్రామాలకు తెరలేపారంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇది నిస్సందేహంగా జగన్ నాటకంలో ఒక భాగం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తన కీలుబొమ్మ మంత్రివర్గాన్ని బలిపశువును చేస్తున్నట్లు కనిపిస్తోంది అని విమర్శించారు. జగన్ తన మంత్రివర్గం నుంచి ఎందుకు రాజీనామాలు కోరుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జగన్ కేబినెట్‌లోని కొందరి మంత్రులపై అవినీతి ఆరోపణలు, మరికొందరిపై క్రిమినల్ కేసులు ఉన్నందున రాజీనామాలు కోరుతున్నాడా? పదవీచ్యుతులైన మంత్రుల అసభ్యకరమైన భాష సీఎంను సంతృప్తి పరచలేకపోయిందని మారుస్తున్నాడా? లేక కొత్త మంత్రివర్గంలో రాజకీయ ప్రత్యర్థులపై మరింత అసహ్యకరమైన పదజాలం ఉపయోగించే వ్యక్తులను జగన్ కోరుకుంటున్నాడా? ఎందుకు రాజీనామాలు కోరుతున్నాడో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

జగన్ అధికార పీఠం నుంచి దిగిపోవాలి

మంత్రివర్గ పునర్నిమాణంతో వైసీపీ తన అవినీతి బురద కడుక్కోవాలంటే కేవలం రాజీనామాలు చేస్తే సరిపోదు. బయటకు వెళ్లే మంత్రులపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసేలా సీఎం ఆదేశించాలి అని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, పార్టీ రెండూ కుంటుపడ్డాయి. అవి చావు పడకలపైన ఉన్నాయి. వాటిని రక్షించడం అసాధ్యం. జగన్ ఇకనైనా తన విధ్వంసకర విధానాలను పక్కనపెట్టి, ప్రజలకు క్షమాపణలు చెప్పి అధికార పీఠం నుంచి దిగిపోవాలని ఆయన అన్నారు. జగన్ ఇప్పటి వరకు తన అపరిపక్వ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. ఇప్పుడు తన క్యాబినెట్ విధానంతో మరో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించబోతున్నారు. ఇది జగన్‌ను పదవీచ్యుతుడిని చేయడం ఖాయం అని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.


Next Story

Most Viewed