గోల్డ్ లెవల్లో 'గోల్డ్‌డ్రాప్' అమ్మకాలు.. ధరలు చూసి షాకైనా అధికారులు..

by Disha Web Desk 19 |
గోల్డ్ లెవల్లో గోల్డ్‌డ్రాప్ అమ్మకాలు.. ధరలు చూసి షాకైనా అధికారులు..
X

దిశ, భిక్కనూరు: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కొందరు మధ్య దళారులు ఇదే అవకాశంగా భావించి ఆయిల్ ప్యాకెట్ల ధరలను మార్చి విక్రయిస్తున్న వైనాన్ని చూసి అధికారులు సైతం బిత్తర పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అడ్డగోలుగా ధరలు పెంచి నూనె ప్యాకెట్లను అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో అధికారులు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూడడంతో అవాక్కయ్యారు. గోల్డ్ డ్రాప్ కంపెనీకి చెందిన నూనె ప్యాకెట్ రూ.157 ఎమ్మార్పీ ఉన్న ధరను రూ.197గా మార్చి.. మెదక్ జిల్లాకు చెందిన ఓ ట్రేడర్.. స్థానిక వ్యాపారులకు స్టాక్ సరఫరా చేశాడు. హోల్‌సేల్‌గా వ్యాపారస్తులకు రూ.165లకు రాగా, వ్యాపారస్తులు రూ.175 చొప్పున విక్రయిస్తున్నారు. షాపులకు సరఫరా చేసిన ట్రేడర్‌కు చెందిన బిల్లులతో పాటు, ఆయా కిరాణా షాప్‌ల నుండి ఆయిల్ ప్యాకెట్ల శాంపిళ్లను సేకరించారు. వివిధ బ్రాండ్‌లకు చెందిన ఆయిల్ ప్యాకెట్ల ధరలను అధికారులు పరిశీలించినప్పటికీ, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం రాకపోగా.. ఒక్క గోల్డ్ డ్రాప్ కంపెనీకి చెందిన ఆయిల్ ధరలపైనే రూ.40 వ్యత్యాసం ఉండడం చూసి విస్మయం వ్యక్తం చేశారు.

మెదక్ జేసీకి రిప్రజెంటేషన్ చేస్తా..

నూనె ధరల చీటింగ్‌పై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై మెదక్ జేఏసీతో రిప్రజెంటేషన్ చేస్తానని చెప్పారు. నూనెలను అధిక ధరకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. ఈ తనిఖీలో భిక్కనూరు తహశీల్దార్ నర్సింలు, డీటీ సివిల్ సప్లై కిష్టయ్య, ఆర్‌ఐ ప్రభాకర్ తహశీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed