CM KCR: ఆ విషయం సైంటిస్టులు నాకు ముందే చెప్పారు: సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
CM KCR: ఆ విషయం సైంటిస్టులు నాకు ముందే చెప్పారు: సీఎం కేసీఆర్
X

CM KCR

దిశ ప్రతినిధి, మేడ్చల్: కులాలు, మతాల పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారని, అది క్యాన్సర్ కంటే ప్రమాదకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదన్నారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారం తోట ముత్యాలమ్మ ఆలయం సమీపంలో వెయ్యి పడకలతో నిర్మించునున్న అత్యాధునిక ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో టీమ్స్ పేరిట మూడు అత్యాధునిక ఆసుపత్రులకు భూమి పూజ చేసుకున్నాం. టీమ్స్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తామన్నారు. అల్వాల్‌లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక్కడ మహిళలకు ప్రసూతీ సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

కరోనా లాంటి వైరస్‌లు భవిష్యత్తులోనూ వచ్చే ప్రమాదముందన్నారు. మనిషి పుట్టక ముందే వైరస్‌లు, భూమి ఉన్నట్లు సైంటిస్ట్‌లు తనకు తెలియజేశారని సీఎం వివరించారు. హైదరాబాద్ నగరంపై ఒత్తిడి పెరుగుతున్నందున ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఆసుపత్రులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే కుల, మతాల పేరిట రాజకీయాలు చేసే వారిని ప్రజలు గమనించాలని కోరారు. మన దేశానికి చెందిన సుమారు 13 కోట్ల మంది విదేశాలలో ఉన్నారని, అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపిస్తే బాధితులకు ఉద్యోగాలు ఎవరిస్తారని ప్రశ్నించారు. ఏడేళ్ల కాలంలో హైదరాబాద్‌లో 2.౩౦ లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి, 10 నుంచి 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.

14 ఎకరాల్లో ఫార్మా వర్సిటీ..

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్‌లో 14 వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రపంచానికే వ్యాక్సిన్లను అందించిన రాజధాని హైదరాబాద్ అని, జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ సంస్థలు ఉన్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి పరిశ్రమలను పెట్టేందుకు వ్యాపరవేత్తలు వస్తున్నట్లు తెలిపారు. మతం, కులం పేరుతో కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ఎవరూ రారన్నారు. అలాంటి క్యాన్సర్ మనం తెచ్చుకోవదన్నారు.

అక్కడ కరెంట్ ఉంటే వార్త.. ఇక్కడ పోతే వార్త..

తెలంగాణలో కరెంట్ పోతే వార్త అవుతుందన్నారు. కానీ, ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో కరెంట్ ఉంటే వార్తవుతుందని తెలిపారు. కరెంట్ కోసం గుజరాత్‌లో రైతులు రోడ్లపై వచ్చి పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్, మహారాష్ట్ర తదితర పెద్ద రాష్ట్రాల కంటే మన తలసరి ఆదాయం ఎక్కువన్నారు. తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని చెప్పుకొచ్చారు. తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని, మిషన్ భగీరథతో మంచినీటి కొరత తీరుస్తున్నామని తెలిపారు. సాగునీటి రంగంలో బ్రహ్మండంగా ముందుకు వెళ్తున్నామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో వైద్యం, విద్యపై దృష్టి పెట్టినట్లు సీఎం వివరించారు. తెలంగాణ మరింత అభివృద్ధి సాధించేందుకు దుష్ట శక్తుల నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్టం. దేశానికి స్వత్రంత్రం వచ్చి 75 ఏళ్లయినా, గత పాలకులు హైదరాబాద్ వైద్య అవసరాలను గుర్తించలేదు.

వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పేదలు కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రైవేటు ఐసీయూలో రోజుకూ రూ.50 వేల వరకూ వసూలు చేసే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య, విద్య అందాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని, అందు భాగంగానే అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రం మాదిరే కేంద్రం కూడా జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని అంటోందన్నారు. కేరళ నుంచి వైద్యసిబ్బంది ఇక్కడికొచ్చి పనిచేశారని హరీశ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, మైనంప‌ల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ‌, కాలేరు వెంక‌టేశ్‌, సాయ‌న్న, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, టీఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్‌తో పాటు ప‌లువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed