దావత్ ఇస్తున్నట్లు ఆ హత్య చేసిన వారికి ఎలా తెలిసింది..?

by Vinod kumar |
దావత్ ఇస్తున్నట్లు ఆ హత్య చేసిన వారికి ఎలా తెలిసింది..?
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవుని పల్లి గ్రామానికి చెందిన చెట్కూరి ప్రశాంత్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అదే గ్రామానికి చెందిన సాయి, నూతన్ అనే ఇద్దరు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏంటి..? చనిపోయిన ప్రశాంత్ కు, ఆ ఇద్దరి యువకులకు చంపుకునేంత పాత కక్షలు ఉన్నాయా..? అసలు ప్రశాంత్ ఫలానా చోట దావత్ ఇస్తున్నాడని ఎలా తెలిసింది..? ప్రశాంత్ దావత్ ఇవ్వకుంటే బ్రతికేవాడా..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ఈ కోణంలోనే పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అసలేం జరిగింది..

దేవుని పల్లి గ్రామానికి చెందిన చెట్కూరి ప్రశాంత్ భార్య ప్రసవం అయితే ప్రశాంత్ ఆస్పత్రికి వెళ్ళాడు. కొడుకు పుట్టడంతో సంతోషంలో తేలిపోయాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో భోజనం ఇచ్చేసి తనకు కలిసిన నలుగురు స్నేహితులకు అశోక్ నగర్ కాలనీలోని రైల్వే గేట్ సమీపంలో ఓ అద్దె రూమ్ లో దావత్ ఇచ్చాడు. ప్రశాంత్ తో పాటు నవీన్, వంశీ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నారు. మధ్యలో మూత్ర విసర్జన కోసం ప్రశాంత్ బయటకు రాగానే బైకుపై వచ్చిన ముగ్గురిలో ఇద్దరు వచ్చి ప్రశాంత్ ను కత్తితో పొడిచి పారిపోయారు. మూడవ వ్యక్తి ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు.

చిన్న కత్తితో పొడిచారు..

ప్రశాంత్ ను కత్తితో పొడవగానే ప్రశాంత్ అరుపులు విని గదిలో ఉన్న స్నేహితులు బయటకు వచ్చి ఓ కారులో ప్రశాంత్ ను ఆస్పత్రికి తరలించారు. మధ్యలో 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు ప్రశాంత్ తనను నూతన్, సాయిలు చిన్న కత్తితో పొడిచారని, తన పేరు ప్రశాంత్, తండ్రి పేరు రాములు అని పోలీసులకు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సాయి అనే వ్యక్తికి ప్రశాంత్ కు మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయని గ్రామంలో ప్రచారం సాగుతోంది. ఇరువురు ఒకరి ఇంటికి వెళ్లి ఒకరు వెళ్లి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ గొడవ ఎప్పుడో సద్దుమణిగిందని పలువురు చర్చించుకుంటున్నారు.

పథకం ప్రకారమే హత్య..?

ప్రశాంత్ హత్య పక్కా పథకం ప్రకారమే జరిగినట్లుగా తెలుస్తోంది. నలుగురితో కలిసి ప్రశాంత్ దావత్ చేసుకుంటున్నట్లుగా హత్యకు పాల్పడిన వారికి ఎలా తెలిసింది. ప్రశాంత్ తో ఉన్న నలుగురిలో ఎవరైనా బయటకు సమాచారం ఇచ్చారా.. అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ అలా సమాచారం ఇస్తే ఎవరిచ్చారు అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది.

Next Story