Chandrababu Naidu: ప్రధాని నరేంద్రమోడీ ,లోక్‌సభ స్పీకర్‌లకు చంద్రబాబు లేఖ

by Dishanational1 |
Chandrababu Naidu to visit Flood Affected Areas for 3 days
X

దిశ, ఏపీ బ్యూరో : Chandrababu Naidu Writes to PM Modi and Lok Sabha Speaker to install Alluri Sitarama Raju Statue in Parliament| మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాలకు లేఖలు రాశారు. భారత స్వాతంత్య్ర 75వ వసంతాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరి సీతారామరాజును స్మరించుకోవడం తెలుగు ప్రజలు ఎంతో గర్విస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరపున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. '2022 జులై 4న భీమవరంలో మీరు చేస్తున్న అల్లూరి విగ్రహ ఆవిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తిండిపోతుంది.

ఈ ఏడాదే అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు ఉండటం ఆనందదాయకం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం, అల్లూరి 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఆవిష్కరించడం ఎంతో సముచితం. సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం చేసిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. అల్లూరి ఏజెన్సీ ప్రాంత గిరిజనుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చాడు. నేటికీ అల్లూరి పేరు ఈ ప్రాంత ప్రజలలో మారుమోగుతోంది. అల్లూరి సీతారామ రాజు 'మన్యం వీరుడు', 'విప్లవ జ్యోతి' గా నేటికి ప్రసిద్ధి' అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

13వ లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వం విగ్రహం పెట్టాలని నిర్ణయించింది

బ్రిటీష్ ఫైరింగ్ స్క్వాడ్ చే అల్లూరి సీతా రామరాజు అత్యంత కృరంగా చంపబడ్డారు అని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. అల్లూరి జీవితం స్వాతంత్య్రోద్య స్పూర్తికి, త్యాగం, ధైర్యసాహసాలకు నిలువుటద్దం అని కొనియాడారు. టీడీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటు హాల్లో ఏర్పాటు చేయాలని13వ లోక్‌సభలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ నాడు కేంద్రంలో, ఏపీలో ప్రభుత్వాలు మారడంతో విగ్రహ ప్రతిష్ఠాపనలో జాప్యం జరిగింది. కావున తదుపరి ఎటువంటి జాప్యం లేకుండా అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలి అని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజుని సత్కరించుకోవడం అంటే దేశ స్పూర్తిని, మన గిరిజన జాతులను గౌరవించుకోవడమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలకు రాసిన లేఖలో తెలియజేశారు.



Next Story