ఉమన్ ఖాజీ.. నిఖా డ్యూటీ.. పురుషాధిక్యతను సవాల్ చేసిన మహిళ

by Manoj |
ఉమన్ ఖాజీ.. నిఖా డ్యూటీ.. పురుషాధిక్యతను సవాల్ చేసిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : సామాజికంగా ఎంతో పురోగతి సాధిస్తున్న.. మహిళలు లింగ వివక్ష, పురుషాధిక్యతను ఎదుర్కొంటున్న అనేక రంగాల్లో పౌరోహిత్యం కూడా ఒకటి. ఆదిపరాశక్తిగా కొలిచినా, సృష్టికి మూలమని సంబోధించినా.. నేటికీ కొన్ని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం లేదంటే మన పురోగతి ఏపాటిదో ఆలోచించుకోవచ్చు. అయితే ఈ కట్టుబాట్లను తెంచేస్తున్న కొందరు స్త్రీలు.. పౌరోహిత్యానికి తాము అర్హులమేనని చాటిచెబుతున్నారు. తాజాగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఓ మహిళ.. ఇద్దరు దంపతుల 'నిఖా' వేడుకల్లో 'ఖాజీ'గా బాధ్యతలు నిర్వర్తించి వార్తల్లో నిలిచింది.

ఇస్లాం సంప్రదాయాల ప్రకారం జరిగే పెళ్లి తంతే 'నిఖా'. ఈ సమయంలో వధూవరుల అంగీకారంతో, చట్టబద్ధంగా కొందరు సాక్షుల నడుమ ఒక వకీలు(ఖాజీ) ప్రమాణపత్రాలపై సంతకాలు(దస్తఖత్: దస్త్=చేయి, ఖత్= వ్రాత) తీసుకొని వారి వివాహాన్ని ధ్రువీకరిస్తాడు. ఈ ప్రమాణపత్రాన్నే 'నిఖానామా'గా పిలుస్తారు. అయితే ఆది నుంచి పురుషులే ఖాజీలుగా వ్యవహరిస్తుండగా.. మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యురాలు, సోషల్ అండ్ ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ సయ్యదా సైదైన్ హమీద్ స్టీరియోటైప్స్‌ బ్రేక్ చేస్తూ రెహమాన్, ఉర్సిలా అలీ వివాహాన్ని జరిపించింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదిలా ఉంటే గతంలో కోల్‌కతాకు చెందిన హకీమా సైతం ఖాజీగా వ్యవహరిస్తూ ఓ ముంబై జంట వివాహాన్ని ఘనంగా నిర్వహించింది. అలాగే భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్(BMMA).. ఖురాన్, రాజ్యాంగ పద్ధతుల్లో మహిళలకు శిక్షణ ఇస్తూనే నిఖా ఆచారాలను కూడా నేర్పిస్తోంది. ఇక ఫిబ్రవరి 2021లో నటి దియా మీర్జా వివాహం కూడా షీలా అట్టా అనే మహిళా పూజారి సమక్షంలో జరిగింది.



Next Story