క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 కు ఉభయసభలు ఆమోదం

by Harish |
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 కు ఉభయసభలు ఆమోదం
X

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 కు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. సోమవారం లోక్‌సభ ఆమోదించిన బిల్లును బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న దోషులు, ఇతర వ్యక్తుల భౌతిక జీవ నమూనాలను తీసుకోవడానికి ఈ బిల్లు పోలీసులకు చట్టపరమైన అనుమతులను ఇస్తుంది. ఖైదీల గుర్తింపు చట్టం -1920 స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ (గుర్తింపు) బిల్లు- 2022 ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఉభయసభలు ఆమోదం లభించడంతో దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. గత 100 ఏళ్లుగా దేశంలో అమలవుతున్న చట్టంలో సాంకేతిక పురోగతులను చేర్చి దర్యాప్తు ప్రక్రియను బలోపేతం చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. బ్రిటిష్ హయాంలో రూపొందించిన చట్టం ప్రస్తుత కాలంలో సరిపోదని హోంమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిల్లు త్వరలో చట్ట రూపం దాల్చితే నేరాలు చేసిన వ్యక్తులకు శిక్షా రేటును పెంచవచ్చు. పాత చట్టం ప్రకారం నేరస్తుల ఫొటోలు, కొలతలు, వేలిముద్రలు మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఉండేది. కొత్తగా తెచ్చే చట్టం ప్రకారం మేజిస్ట్రేట్ ఆదేశాలతో వేలిముద్రలు, అర చేతి ముద్రలు, అడుగుల ముద్రలు, ఛాయాచిత్రాలు, కనుపాప, రెటీనా స్కాన్, భౌతిక జీవ నమూనాలు వాటి విశ్లేషణలను చేర్చడానికి 'కొలతల' పని చేస్తుందని తెలిపారు.

Next Story