SIR కార్యక్రమంలో BLAలదే కీలక పాత్ర

by Batti.Sumithra |

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) అత్యంత కీలక పాత్ర పోషించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు.

SIR కార్యక్రమంలో BLAలదే కీలక పాత్ర
X

దిశ, దేవరకొండ టౌన్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) అత్యంత కీలక పాత్ర పోషించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకొండ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ఓటు మన హక్కు, దానిని కాపాడటమే BLA బాధ్యత. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బూత్ లెవెల్ ఏజెంట్లు కృషి చేయాలి అని సూచించారు.

బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా బూత్ లెవెల్ ఏజెంట్లు, BLOలు కలిసి మన ఓట్లు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 326 బూత్‌లు ఉన్నాయని, ప్రతి 10 బూత్‌లకు ఒక ఇంచార్జిని నియమించామని తెలిపారు. యువత, మహిళలు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి ఇంటికి చేరుకొని ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించడంలో ప్రజలకు సహాయం చేయాలి. బూత్ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఓటు హక్కును పరిరక్షించాలి. “ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని బాలు నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ SIR ఇంచార్జ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, దేవరకొండ అసెంబ్లీ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ గుంజ రేణుక నారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story