తెలంగాణలో 7 పాయింట్స్ ఫార్ములా.. బీజేపీ భారీ స్ట్రాటజీ

by Disha Web Desk 4 |
తెలంగాణలో  7 పాయింట్స్ ఫార్ములా..  బీజేపీ భారీ స్ట్రాటజీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు, టీఆర్ఎస్ ను ముప్పతిప్పలు పెట్టేందుకు కాషాయదళం 7 పాయింట్స్ ఫార్ములాను పాశుపతాస్త్రంగా ఎంచుకుంది.భారీ స్ట్రాటజీతో గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు సమాయత్తమవుతోంది. అత్యంత సాధారణమైన అంశాలను ఎంచుకుని అసాధారణ గెలుపును సొంతం చేసుకోవాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. ఈ 7 పాయింట్స్ లో సేవాభావం, సమన్యాయం, సంయమనం, సమన్వయం, సానుకూలత, సానుభూతి, సంవాద్(సంభాషణ)ను అస్త్రంగా మలుచుకుంటోంది. తెలంగాణలో గెలుపు కోసం ఈ ఫార్ములానే కమలదళం ఎంచుకుంది. గులాబీ పార్టీ నేతలను ముప్పతిప్పలు పెట్టి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో బీజేపీ ఫుల్​జోష్​లో ఉంది. అయితే ఈ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ఈ ఏడు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ప్రధాని సూచనలను అమలుచేస్తూ టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలను ఈ ఏడు అంశాలకు జోడిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా వివరించడమే ఎజెండాగా కాషాయదళం పెట్టుకుంది. కేంద్రం తీసుకొచ్చిన పథకాల్లో ఎన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఎన్ని పథకాలను ప్రజలకు చేరువకాకుండా అడ్డుకుంటోందనే విషయాలను ప్రజలకు వివరించనున్నారు. హర్​ఘర్​తిరంగ పేరిటి త్వరలో బీజేపీ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతోంది. అందులో భాగంగా క్రమంగా ప్రజల్లోకి ఈ నిర్ణయాలను తీసుకెళ్లాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది.

సేవాభావం: ప్రజలతో బీజేపీ నేతలు సేవాభావంతో మెలగాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, అందుకు వెనుకడుగు వేయొద్దని హైకమాండ్​సూచనలు చేసింది. ఉదాహరణకు ఒక సామాన్యుడికి ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటే అతడిని ఆస్పత్రికి తరలించడమే కాక కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్​భారత్ లాంటి పథకాలపై వారికి చికిత్స అందించాల్సి ఉంటుంది. బూత్ స్థాయి నేత ఇలాంటి ఆపత్కర సమయంలో స్పందిస్తే ప్రజలకు తమ సేవాభావంతో దగ్గరయ్యే అవకాశముంటుందని హైకమాండ్ సూచనలు చేసింది. ప్రజల కోసం కేంద్రం ఇప్పటి వరకు జన్ ధన్ యోజన, స్కిల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, బేటీ బచావో.. బేటీ పఢావో.., ప్రధాని ముద్ర యోజన, అటల్ పెన్షన్​యోజన, ప్రధాన మంత్రి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అమృత్​ప్లాన్, డిజిటల్ ఇండియా మిషన్, ఉదయ్, స్టార్టప్ ఇండియా, ప్రధాని ఉజ్వల ప్లాన్ వంటి పథకాలపై ప్రజలకు తలెత్తే ఇబ్బందులను గర్తించి వారికి సేవలు అందించాలని బీజేపీ నిర్ణయించింది.

సమన్యాయం : బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అనే ముద్ర పడింది. ఈ ముద్రను తొలగించుకోవాలని జాతీయ నాయకత్వం చూస్తోంది. తమ పార్టీలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందనే భరోసా ప్రజల్లో కల్పించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని నేతలకు దిశానిర్దేశం చేసింది. అన్ని వర్గాల ప్రజలకు బీజేపీలో న్యాయం జరుగుతుందనే భరోసా ప్రజలకు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో ముస్లింలలో బీజేపీపై కొంత సానుకూలంగా ఉన్నారు. అలాంటి వారిని దగ్గరకు తీసి ఇంకొంతమందిని బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయాలనేది కమలనాథుల ప్లాన్. అలాగే క్రిస్టియన్ ఓట్లను సైతం లాగాలని చూస్తోంది. తమ పార్టీ ఏ ఒక్క వర్గానికి సొంతం కాదనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తే అధికారం రావడం తథ్యమని భావిస్తోంది. దళిత, గిరిజన తేడా అనేదే లేకుండా వారి ఇండ్లలో బస చేయడం, విందు వంటివి ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించింది.

సంయమనం : పార్టీలో నేతలకు ముఖ్యమంగా కావాల్సింది సంయమనం. అది ఉంటేనే ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కోనైనా పోరాటం చేయొచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఎదుటి వారు రెచ్చగొడితే రెచ్చిపోయి ఏది పడితే అది చేయకూడదని హైకమాండ్​దిశానిర్దేశం చేసింది. దీనికి ఉదాహరణగా నుపుర్​శర్మ ఘటనను నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. చేయాల్సిన పనిని కచ్చితంగా చేయాలని, లేనిపోని వాదనలు, కామెంట్లు చేస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది ఈ ఘటనను చూసి నేర్చుకోవాలని జాతీయ నాయకత్వం సూచనలు చేసింది.

సమన్వయం : పార్టీలో ఒంటెత్తు పోకడకు పోకుండా నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, కేవలం నేతలే కాకుండా ప్రజలను సైతం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకు వాట్సప్ గ్రూపులు ఏర్పాటుచేయాని ప్లాన్ చేస్తోంది. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా శాంతియుతంగా కేసీఆర్ సర్కార్ పై నిరసనలు చేపట్టాలని, ఇందుకు నేతలను వీలైనంత సులువైన పద్ధతులు వినియోగించుకోవాలని, దీనివల్ల ఆర్థిక వనరులు కూడా మిగుల్చుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. అంతేకాకుండా సమయం కూడా ఆదా అవుతుందని ఆలోచన చేస్తోంది. అందుకే వాట్సప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకుంటూ టీఆర్ఎస్ సర్కార్ పై ఒత్తిడి పెంచాలని హైకమాండ్​దిశానిర్దేశం చేసింది. పార్టీ ఎదుగుదలకు, అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఈ ఫార్ములా ఎంతో ఉపయోగపడుతుందని శ్రేణులు భావిస్తున్నాయి.

సానుకూలత : తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇదే సానుకూలమైన సమయమని బీజేపీ భావిస్తోంది. కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తుండటం తమకు కలిసొచ్చే అంశమని కమలనాథులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న హామీలు, అమలు చేయాల్సిన హామీలు బోలెడన్ని పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు భవిష్యత్ లో కేసీఆర్ సర్కార్ తీసుకోబోయే నిర్ణయాల్లో వైఫల్యాలను సమయానుకూలంగా ప్రజలకు వివరించి టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు స్కెచ్ వేస్తోంది. పార్టీకి సానుకూలమైన అవకాశాలు ఎప్పుడూ రావని, వచ్చినప్పుడు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ దానంతట అదే వస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది.

సానుభూతి : నాయకులు ప్రజలపై సానుభూతి కలిగి ఉండాలని, కర్కశత్వంతో ఉండకూడదని బీజేపీ నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. అందరూ తమవాళ్లే అనే అభిప్రాయంతో ఉండాలని జాతీయ నాయకత్వం చెబుతోంది. ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని హైకమాండ్​సూచనలు చేస్తంది. బూత్ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మరిన్ని ఓట్లను రాబట్టొచ్చనేది బీజేపీ స్ట్రాటజీ. సానుభూతితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చనేది కమలనాథుల నమ్మకం.

సంవాద్(సంభాషణ) : ప్రజా సమస్యలపై నేతలు తరుచూ గ్రౌండ్ లెవల్ పర్యటనలు చేపట్టాలని బీజేపీ సూచనలు చేస్తోంది. వారి కష్టసుఖాలను నేరుగా కలిసి సంభాషించి అండగా తామున్నామనే భరోసా నేతలు ప్రజలకు కల్పించాలని సూచించింది. గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జాతీయ నాయకత్వం బలంగా నమ్ముతోంది. ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని జాతీయ నాయకత్వం నేతలకు దిశానిర్దేశం చేసింది. ఈ ఏడు అంశాలను బీజేపీ అస్త్రాలుగా మలుచుకుని టీఆర్ఎస్ పై యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటోంది. ఈ అంశాలకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసేందుకు సిద్ధమవుతోంది.



Next Story

Most Viewed