టీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ బిగ్ ప్లాన్.. అధికార వర్గాల్లో సంచలనం

by Disha Web Desk 4 |
టీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ బిగ్ ప్లాన్..  అధికార వర్గాల్లో సంచలనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారుపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా ముప్పేట దాడికి బీజేపీ సిద్ధమవుతున్నది. కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా ఆధారాలతో సహా ప్రజలకు వివరించడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నది. ఎనిమిదేళ్ళ పాలనలోని వైఫల్యాలను వివరించాలనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖల నుంచి ఇప్పటికే వివరాలను సేకరించిన బీజేపీ నేత బండి సంజయ్.. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద కూడా అధికారికంగా ఇన్ఫర్మేషన్‌ను రాబట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. వివిధ శాఖలకు చెందిన మొత్తం 88 అంశాలపై ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. ఒక్కసారే ఇన్ని దరఖాస్తులు సమర్పించడం అధికార వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ళ కాలంలో సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు? అధికారిక నివాసం కోసం నిర్మించుకున్న ప్రగతి భవన్‌కు ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు? ఎంత కాలంలో దీన్ని నిర్మించుకున్నారు? ఇందులో బస చేసింది ఎన్ని రోజులు? స్వంత ఫామ్ హౌజ్‌లో ఎన్ని రోజులు ఉన్నారు? విమాన ప్రయాణాల కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చెంత? ఇతర రాష్ట్రాల పర్యటన సందర్భంగా అయిన ఖర్చు ఎంత? ఎనిమిదేళ్ళ కాలంలో ఖజానా నుంచి జీతభత్యాల కోసం తీసుకున్నదెంత? పరిపాలనలో ముఖ్యమంత్రికి సహాయకంగా ఉండడానికి ఉన్న సలహాదారులెంతమంది? ఇప్పటివరకు వారు ఇచ్చిన సలహాలెన్ని? ఎలాంటి సలహాలు వచ్చాయి..? ఇలా మొత్తం 66 రకాల అంశాలపై 88 ఆర్టీఐ దరఖాస్తును జూన్ 28న దాఖలు చేశారు.

ఆర్టీఐ చట్టం కింద సమాచారాన్ని తీసుకోవాలనుకునే ఆలోచన వెనక భారీ వ్యూహమే ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. ఈ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా నిర్దిష్ట గడువులోగా సమాచారం ఇవ్వాల్సిందేనని, అలా వచ్చిన సమాచారం అధికారికమైనదే అవుతున్నందున వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆ పార్టీ లీగల్ నిపుణులు భావిస్తున్నారు. సకాలంలో సరైన సమాధానాలు ఇవ్వకపోతే ఫస్ట్, సెకండ్ అప్పీల్‌కు వెళ్ళి ప్రభుత్వం నుంచి సమాధానాలను రాబట్టే తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన సమాధానాలతో ప్రజాధనం ఏ మేరకు దుర్వినియోగమైందో తెలుస్తుందని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బద్నాం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నది కమలనాధుల వ్యూహం.

మరోవైపు ఈ సమాధానాల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రజాధనం ఏ మేరకు దుర్వినియోగమైందో లెక్క తేల్చి న్యాయస్థానాలను ఆశ్రయించాలనుకుంటున్నది బీజేపీ. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ఆర్టీఐను వాడుకోవాలనుకుంటున్నది. ఒకవేళ ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు రాకపోయినా కోర్టులకు వెళ్ళి చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు కొట్లాడాలనుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అనేక అంశాలకు ఆధారాలతో కూడిన సమాచారం రాకపోవడంతో, అధికారుల నుంచి రాబట్టలేకపోవడంతో ఆర్టీఐ మార్గాన్ని ఎంచుకున్నది. ఒక్క రోజులోనే భారీ స్థాయిలో అప్లికేషన్లను ఫైల్ చేసిన బండి సంజయ్// ఇకపైన మరింత ఉధృతంగా చేపట్టాలనుకుంటున్నారు.

ఆర్టీఐ అప్లికేషన్ల ద్వారా సమాచారం వచ్చినా.. రాకపోయినా.. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టడమే ఏకైక లక్ష్యంగా బండి సంజయ్ భావిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని వాస్తవాలను కరపత్రాలు, రచ్చబండలు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వివరించాలనుకుంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జేపీ నడ్డా, అమిత్ షా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తదితరులు 'నిద్ర పోవొద్దు... సర్కారును నిద్రపోనివ్వొద్దు..' అని క్లారిటీ ఇవ్వడంతో బండి సంజయ్ దూకుడు పెంచారు. సమావేశాలకు ముందే ఈ దరఖాస్తులను సమర్పించినట్లు పేర్కొన్నా.. అన్నింటినీ రెడీ చేసుకుని కార్యవర్గ సమావేశాల తర్వాత పోస్టు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఆర్టీఐ దరఖాస్తుల్లో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా లోతైన ప్రశ్నలు అడగడంతో వేర్వేరు విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించి ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయం అధికారుల నుంచి వినిపిస్తున్నది. అడిగిన సమాచారాన్ని క్రోడీకరించి ఇవ్వక తప్పదని, లేనిపక్షంలో ఉల్లంఘనల చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పార్టీ అధ్యక్షుడిగా, మరోవైపు లోక్‌సభ ఎంపీగా ఉన్నందున సమాధానాలు ఇచ్చి తీరాల్సిందేనన్న ఒత్తిడి అధికారులకు ఏర్పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకోవడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది.

బండి సంజయ్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుల్లోని కొన్ని అంశాలు ...

= ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు?

= రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారిక నివాసంలో బస చేసింది ఎన్ని రోజులు? ఫామ్ హౌజ్‌లో ఉన్నది ఎన్ని రోజులు?

= ప్రగతి భవన్ నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ఖర్చెంత? నిర్మాణం ఎప్పుడు మొదలై ఎప్పటికి పూర్తయింది?

= రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారు, ఎంత ఖర్చయింది? ప్రైవేటు విమానాలకు అయిన ఖర్చు ఎంత? ఇతర రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ప్రైవేటు హోటళ్ళకు అయిన ఖర్చెంత?

= రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జీతభత్యాల రూపంలో తీసుకున్నదెంత?

= ఎనిమిదేళ్ల కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు, ఖాళీల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు, ఇంకా ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి...

= రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఎంత సాగునీరు అందుతున్నది? ఎన్ని లక్షల ఎకరాలకు సరఫరా అవుతున్నది?

= ఎనిమిదేళ్ళ కాలంలో ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకు ఎంత భూమి పంపిణీ అయింది? ఎన్ని కోట్లు ఖర్చయింది? వచ్చిన దరఖాస్తులు ఎన్ని? ఎంతమంది అర్హులు ఉన్నారు? పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు ఎన్ని?

= ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది, జిల్లాలవారీగా దరఖాస్తు చేసుకున్నది ఎంతమంది? అందులో అర్హులు ఎంతమంది? ఇండ్లను అందుకున్న లబ్ధిదారులెంతమంది? పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులెన్ని? ఇండ్ల నిర్మాణానికి అయిన ఖర్చెంత?

= రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంత మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ అయింది? 2018నుంచి 2022 వరకు బడ్జెట్ కేటాయింపులెన్ని? ఇప్పటివరకు ఖర్చు అయినదెంత?

= ఎనిమిదేళ్ల కాలంలో బీసీలకు కేటాయించిన నిధులు, ఖర్చు, ఏ అవసరం కోసం ఎంత ఖర్చయింది? సబ్సిడీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులెన్ని? ఎంత మంది లబ్ధిదారులకు మంజూరైంది?

= ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంది సలహాదారులను నియమించింది? వారికి ఇస్తున్న జీతభత్యాలేంటి? ఇప్పటివరకు ఎన్ని సలహాలు ఇచ్చారు? ఎన్నింటిని ప్రభుత్వం పాటించింది? వారు సలహాలు ఇస్తున్నదెవరికి?

= రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2021 వరకు ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులపై భూ కబ్జాలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులెన్ని? వాటిపైన తీసుకున్న చర్యలేంటి? కలెక్టరు లేదా ఏసీబీ లేదా విజిలెన్స్ శాఖ ద్వారా దర్యాప్తు జరిగిందా? నివేదికల వివరాలేంటి? పత్రికల్లో వస్తున్న వార్తలు సీఎం దృష్టికి వెళ్ళాయా?

= రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాలవారీగా ఉన్న రేషన్ కార్డులెన్ని? కొత్తగా వచ్చిన అప్లికేషన్లు ఎన్ని? మంజూరైనవెన్ని? పెండింగ్‌లో ఉన్నవెన్ని? రద్దయిన కార్డులెన్ని?

= రేషను బియ్యం దారిమళ్ళిందెంత? అక్రమంగా తరలిపోయినదెంత? ఎఫ్‌సీఐ నుంచి నివేదిక వచ్చిందా? దానిపై తీసుకున్న చర్యలేంటి? రైస్ మిల్లుల అక్రమాలపై ఎఫ్‌సీఐ ఇచ్చిన నివేదిక వివరాలేంటి?

= ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీలకు చెందిన జిల్లాలవారీగా ఆసరా లబ్ధిదారులెంతమంది? కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి? 57 ఏళ్ళు నిండినవారికి అమలవుతున్నదా?

= ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నవారు ఎంత మంది? పరిష్కారమైనవెన్ని? ఈ పోర్టల్ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చెంత? ఎవరు రూపొందించారు?

= పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ కార్యదర్శులకు ఇస్తున్న జీతాలెంత? పే స్కేల్, సర్వీస్ రెగ్యులరైజేషన్ ఎప్పటికి పూర్తవుతుంది?

= ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులెన్ని? అందులో ఖర్చయినదెంత?

= పల్లె ప్రగతి కింద పంచాయతీల్లో జరిగిన పనులెన్ని? కేటాయించిన నిధులెన్ని? ఇంకా ఎంత కేటాయించాల్సి ఉన్నది?

= రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలివ్వాలంటూ వచ్చిన దరఖాస్తులెన్ని? పరిశీలనలో ఉన్నవెన్ని? గుర్తించింది ఎన్ని? అర్హులైనవారు ఎంత మంది? గిరిజనులు, ఆదివాసులపై ఫారెస్టు, ప్రభుత్వ సిబ్బంది నమోదు చేసిన కేసులెన్ని?


Next Story

Most Viewed