ఆర్థిక సంక్షోభంలో పాక్.. దిగుమతులపై కీలక నిర్ణయం

by Dishanational4 |
ఆర్థిక సంక్షోభంలో పాక్.. దిగుమతులపై కీలక నిర్ణయం
X

కరాచీ: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కష్టాలను ఎదుర్కొంటామని దేశ ఆర్థిక శాఖ మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ తెలిపారు. ఈ సంక్షోభం నుంచి దేశ ప్రజలు బయట పడాలంటే పాకిస్తాన్ మూడు నెలలపాటు వేరే దేశాల నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ హాజరై ప్రసంగించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా కూలిపోయిందన్నారు.

ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ హయాంలో దేశం మొక్క లోటు బడ్జెట్ 1600 బిలియన్ డాలర్లు ఉంటే.. తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పాలనలో 3,500 బిలియన్ డాలర్లు పెరిగిందన్నారు. ఇలాంటి లోటు బడ్జెట్‌తో దేశం అభివృద్ధి చెందడం చాలా కష్టమన్నారు. మూడు నెలలపాటు దిగుమతులను తగ్గిస్తే.. అప్పటిలోపు ఒక విధానాన్ని తయారు చేసుకుని, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని మిఫ్తా ఇస్మాయిల్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ దిగుమతి బిల్లు 80 బిలియన్ డాలర్లు ఉంటే.. ఎగుమతుల బిల్లు 31 బిలియన్ డాలర్లు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇస్మాయిల్ స్పష్టం చేశాడు.


Next Story