దిశ ఎఫెక్ట్‌: కలెక్టర్ సడన్ ఎంట్రీ.. వెంటనే కొత్త నాటకానికి తెరలేపిన అధికారులు

by Disha Web Desk 19 |
దిశ ఎఫెక్ట్‌: కలెక్టర్ సడన్ ఎంట్రీ.. వెంటనే కొత్త నాటకానికి తెరలేపిన అధికారులు
X

దిశ, వరంగల్ టౌన్: ఎనుమాముల మార్కెట్లో జ‌రుగుతున్న జీరో దందాపై వ‌రంగ‌ల్ క‌లెక్టర్ గోపి స్పందించారు. దిశ మీడియాలో వ‌రుస‌గా సాక్ష్యాధారాల‌తో స‌హా క‌థ‌నాలు ప్రచురిత‌మైన విష‌యం పాఠ‌కుల‌కు విధిత‌మే. అక్రమాలు ఎలా జరుగుతున్నాయి..? అక్రమానికి కారణం ఎవరు..? అనే విషయాలను క‌థ‌నాల్లో కళ్లకు క‌ట్టినట్లు చూపించారు. మార్కెట్ ఆదాయానికి గండికొట్టేలా కార్యదర్శి రాహుల్ వ్యవ‌హ‌రిస్తున్న తీరును క‌థ‌నాల్లో ఎండ‌గ‌ట్టింది. అక్షర పోరాటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లింది. ఈ నేప‌థ్యంలో స్వయంగా మంగ‌ళ‌వారం క‌లెక్టర్ మార్కెట్‌ను సంద‌ర్శించారు. అయితే జిల్లా బాస్ మార్కెట్‌కు వస్తున్న సంగతి లీకైయిందో ఏమో.. ఏకంగా మార్కెట్లో సమాచారం సీన్ కాస్త మారిపోయింది. మార్కెట్లో ఉన్నట్లుండి ఎలక్ట్రానిక్ కాంటలు దర్శనమిచ్చాయి. కలెక్టర్ కారు దిగగానే కనపడేలా కాంటాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పలువురు రైతులు బాహాటంగానే చ‌ర్చించుకోవ‌డం క‌నిపించింది.

కనిపించిందే కరెక్ట్..!

కలెక్టర్ రాక‌ను ముందే ప‌సిగ‌ట్టారేమో తెలియ‌దు కానీ.. పాల‌క‌వ‌ర్గంలోని కీల‌క స‌భ్యుల‌తో పాటు అధికారులు అంతా స‌వ్యవంగానే జ‌రుగుతోంద‌న్న రీతిలో నాట‌కానికి తెర‌లేపారు. మార్కెట్లో జ‌రుగుతున్న జీరో దందాను ఒక్కరోజు బ్రేకులు వేసిన అధికారులు, వ్యాపారులు క‌లెక్టర్‌కు ర‌శీదులు చూపి నిజాయితీ చాటుకునే ప్రయ‌త్నం చేశారు. అయితే కలెక్టర్‌కు చూపిన రశీదులు నిజమని నిరూపితమని అనుకుందాం. అయితే ఇక్కడ పరిశీలించాల్సిన అంశం మరొకటి ఉంది. మార్కెట్‌కు ప్రతిరోజు వచ్చే సరుకు వివరాలు 'లాట్' బుక్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా ఆ రోజు మార్కెట్‌కు వచ్చిన సరుకు, ఖరీదు జరిగిన సరుకు వివరాలను బేరీజు వేసినా.. మార్కెట్‌లో ఏం జరుగుతుందో నోటి మీద లెక్క చెప్పాచ్చు. కానీ, కలెక్టర్ మార్కెట్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో అధికారులు ఈ విధంగా చూప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మార్కెట్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అలా జరగకుండా చూసుకోండి.. అంటూ కలెక్టర్ మార్కెట్ అధికారులను సుతిమెత్తగా మందలించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి క‌లెక్టర్ ప‌ర్యట‌న‌తోనే ఈ జీరో దందా విచార‌ణ ముగిసిపోతుంది అనుకోవాలా..? స‌మ‌గ్ర విచార‌ణ కొన‌సాగుతుందా అన్నది వేచి చూడాలి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో జరుగుతున్న జీరో దందా గిరిపై, అక్రమాల‌కు కొమ్ముకాస్తూ తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్న కార్యద‌ర్శి, ఇత‌ర అధికారుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని రైతులు కోరుతున్నారు.



Next Story