కేబీఆర్ పార్కులో దారుణం.. భర్తతో కలిసి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం

by Disha Web Desk |
కేబీఆర్ పార్కులో దారుణం.. భర్తతో కలిసి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గతంలో గన్ ఫైరింగ్, హత్యాయత్నం, అత్యాచారయత్నం ఘటనలు చోటుకున్నాయి. ఈ పార్క్‌కు ఉదయం, సాయంత్రం వేళల్లో వందల మంది ప్రముఖులు వాకింగ్ చేయడానికి వస్తుంటారు. అయినా కేబీఆర్‌లో రక్షణ చర్యలపై నీలినీడలు అములుకుంటున్నాయి. తాజాగా భర్తతో కలిసి వాకింగ్‌కు వచ్చిన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి చెందిన మహిళ తన భర్తతో కలిసి శనివారం ఉదయం 5:45 గంటలకు కేబీఆర్ వాక్ వేలో వాకింగ్ చేస్తోంది. అక్కడే ఉన్న ఓ అపరిచిత వ్యక్తి ఆమెను అనుసరించాడు. వాకింగ్‌ సమయంలో భర్తకు ఆమెకు మధ్య దూరం పెరగడం.. చుట్టూ చెట్లు, నిర్మానుష్యంగా ఉండటంతో వెంటనే దుండగుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ చెట్ల పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. షాక్‌కు గురైన ఆమె వెంటనే గట్టిగా కేకలు వేయడంతో భర్త పరుగున అక్కడికి వచ్చాడు. భర్తను చూసి దుండగుడు చెట్లలో నుంచి పరారీ అయ్యాడు. అనంతరం బాధిత మహిళ భర్తతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కాగా, ఆ మహిళ భర్త ప్రముఖ వ్యాపారిగా తెలుస్తోంది. ప్రతిరోజు భార్యభర్తలు వాకింగ్‌కు వస్తున్నట్లు సమాచారం. రోజు మాదిరిగానే వచ్చిన వాళ్లకు తెల్ల షర్ట్, నల్లటి ప్యాంట్, మాస్క్ ధరించిన వ్యక్తి మహిళను వెనకంగా పట్టుకుని అఘాయిత్యం చేయబోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. పార్క్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని, నిందితుడిని ఎలా గుర్తిస్తామంటూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలీసుల తీరుపై మంత్రి కేటీఆర్, నగర పోలీస్ కమిషనర్‌‌కు ఫిర్యాదు చేశారు. నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయనే ధీమాతో ఉన్నామని, అవన్నీ అలంకార ప్రాయమేనా..? అని వాపోయాడు. కాగా ఇటీవల నటి షాలు చౌరాసియాపై కూడా గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడి చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed