నెల్లూరులో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

by Disha Web Desk 7 |
నెల్లూరులో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
X

దిశ, ఏపీ బ్యూరో : నెల్లూరు నగరంలో సెప్టెంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఈ ర్యాలీకి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణపై గుంటూరు రేంజ్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ కోహ్లీతో కలిసి జిల్లా కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ... సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నెల్లూరు నగరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 34,338 మంది ఈ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో జిల్లాకు చెందిన 970 మంది అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు.

గతంలో కంటే ఈసారి జిల్లా నుంచి 50 శాతం అదనంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో వెనుకబడిన తరగతులకు చెందిన, పేద విద్యార్థులను గుర్తించి రెండు బ్యాచ్ లుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక నెల పాటు ఇవ్వనున్న ఈ శిక్షణలో వీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా, రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి, ఎక్కువమంది అగ్ని వీరులు మన జిల్లా నుంచి ఎంపికయ్యేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలో పది రోజుల పాటు జరిగే అగ్నివీర్ నియామకాలకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి హాజరవుతున్న అభ్యర్థులకు, ఆర్మీ అధికారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు.

ముఖ్యంగా బారికేడ్లు ఏర్పాటు, తాగునీరు, 24 గంటల పాటు విద్యుత్ సౌకర్యం, ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ల సాంకేతిక టెక్నాలజీ, అభ్యర్థులు ఉండడానికి భోజన వసతి సౌకర్యాలు, మెడికల్ బృందాలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ, ఆర్మీ అధికారులకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా జరిగేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాకు మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్, రన్నింగ్, ఇతర వ్యాయామాలకు సంబంధించిన మౌలిక వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ రిక్రూట్మెంట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులందరూ కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మూడు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొంది రిక్రూట్మెంట్‌లో పాల్గొనాలని కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు.

క్షేత్రస్థాయిలో ఏర్పాట్లకు సిద్ధం

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసిందని..సెప్టెంబర్ 13 లోగా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని రిక్రూట్మెంట్ ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు గుంటూరు రేంజ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ కల్నల్ కోహ్లీ తెలిపారు. ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దశలవారీగా జరిగే ఈ రిక్రూట్మెంట్ లో అభ్యర్థుల ఎత్తు, బరువు, ఫిట్నెస్, పుల్లప్స్ , రన్నింగ్ మొదలైన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల ఫోటో వెరిఫికేషన్, బయోమెట్రిక్ చేపట్టి ఎంపికైన అభ్యర్థుల వివరాలను న్యూఢిల్లీకి పంపనున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులు అందరూ ఈ ర్యాలీ విజయవంతం చేసేందుకు ఆర్మీ అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు ఆర్మీ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన బుక్‌లెట్‌ను కల్నల్ అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ,ఏఎస్పీ శ్రీనివాసరావు, సెట్నల్ సీఈవో పుల్లయ్య, ఉప రవాణా కమిషనర్ చందర్, జిల్లా వైద్యాధికారి పెంచలయ్య, డిఈఓ రమేష్, డిఆర్డిఎ పిడి సాంబశివారెడ్డి, ఆర్డిఓ కొండయ్య, చీఫ్ కోచ్ యతిరాజ్, జాతీయ సమాచార కేంద్రం అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story