ఏపీ డిప్యూటీ సీఎంకు షాక్.. టీడీపీలోకి ఆడపడుచు

by Vinod kumar |
ఏపీ డిప్యూటీ సీఎంకు షాక్.. టీడీపీలోకి ఆడపడుచు
X

దిశ, ఏపీ బ్యూరో: డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి షాక్ తగిలింది. సొంత కుటుంబ సభ్యులే ఆమెకు ఝలక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఆడపడుచు శత్రుచర్ల పల్లవి రాజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పుష్ప శ్రీవాణి సొంత మామ చంద్రశేఖర్ రాజు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రశేఖర్ రాజు సైలెంట్‌గా ఉన్నారు. గతంలో ఈయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

అయితే అకస్మాత్తుగా పుష్ప శ్రీవాణి ఆడపడుచు అయినటువంటి పల్లవి రాజు బుధవారం పార్వతీపురంలో కురుపాం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అభిమానులతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే అంతా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఆమె కార్యకర్తల విజ్ఞప్తి మేరకు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.


త్వరలోనే టీడీపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కురుపాం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. వైసీపీ పాలనలో గిరిజనుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఇప్పటికీ గిరిజనులు వైద్యం, విద్యతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన పోరాడేందుకు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇకపోతే పల్లవి రాజు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు. పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు కు సొంత చెల్లెలు కావడం విశేషం. పల్లవి రాజు 2019 ఎన్నికల్లోనూ టీడీపీ లో చేరాలని ప్రయత్నించారు. నాడు టీడీపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించకపోవడంతో ఆమె వెనక్కి తగ్గారు.


అయితే ఇప్పుడు చంద్రబాబు టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె పార్టీలో చేరనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆడపడుచు రాజకీయాల్లోకి రావడం అందులోనూ ప్రత్యర్థి పార్టీలో చేరడం పుష్ప శ్రీవాణికి కాస్త ఇబ్బంది అన్న విషయం తెలిసిందే. ఈ అంశం పుష్ప శ్రీవాణికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.

Next Story

Most Viewed