హైదరాబాద్ సిటీ పోలీసులకు మరో ఆయుధం.. మిలటరీ తరహా నిఘా

by Disha Web Desk |
హైదరాబాద్ సిటీ పోలీసులకు మరో ఆయుధం.. మిలటరీ తరహా నిఘా
X

దిశ, తెలంగాణ బ్యూరో : విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌లో పోలీసులు ఇకపైన డ్రోన్ల ద్వారానూ నిఘా వేయనున్నారు. వ్యవసాయం, సరుకు రవాణా తదితరాలకు విస్తృతంగా డ్రోన్లను నిర్వహించే వెసులుబాటు రావడంతో ఇప్పుడు పోలీసు వ్యవస్థ సైతం దాన్ని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. శాంతిభద్రతల నిర్వహణతో పాటు అనేక అంశాల్లో డ్రోన్లు ఉపయోగపడతాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి వైద్య అవసరాల కోసం ప్రయోగాత్మకంగా కొంతకాలం నడిచిన డ్రోన్ల ఆపరేషన్‌ను ఇకపైన పోలీసు విభాగం సైతం విస్తృతంగా వాడాలనుకుంటున్నది. విధానపరమైన నిర్ణయం తీసుకున్నా ఇది అమల్లోకి రావడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికి హైదరాబాద్ పరిధిలోనే దీన్ని వాడాలనుకుంటున్నట్లు తెలిసింది. ఫలితాల విశ్లేషణ అనంతరం రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది.

హైదరాబాద్ నగరంలో త్వరలో రెండు మల్టీ రోటార్ డ్రోన్ల ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటు అవసరాన్ని బట్టి శాంతిభద్రతల అవసరాలకు కూడా వినియోగించాలన్న చర్చ జరుగుతున్నది. హై రిజొల్యూషన్ కెమెరాలను వాడి వీడియోలను, ఫొటోలను రియల్ టైమ్‌లోనే అందుకోడానికి వీలుగా ప్రత్యేకంగా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇలా అందినవాటిని ఇంటర్నెట్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపి అక్కడి నుంచి సంబంధిత పోలీసు స్టేషన్లకు చేరవేసి తదనుగుణమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. భారీ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నప్పుడు వాటిని ఆకాశం నుంచే డ్రోన్ల ద్వారా రియల్ టైమ్‌లో పసిగట్టి వెంటనే స్పందించడానికి పోలీసులకు అవకాశం లభిస్తుంది.

కరోనా టైమ్‌లో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిర్ణయాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి కొంతకాలం పోలీసులు డ్రోన్లను వినియోగించారు. ఇకపైన వీటిని రెగ్యులర్‌గానే వినియోగించే ఆలోచన ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నాలుగు కి.మీ. దూరం వరకు రిమోట్ ద్వారానే ఆపరేట్ చేయడం, నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను చిత్రీకరించడం లాంటి అవసరాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం వీధుల్లో లక్షల సంఖ్యలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు అదనంగా డ్రోన్లను సైతం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నది పోలీసు శాఖ. ఆధునిక టెక్నాలజీని వాడుకోవడం ద్వారా నేర నియంత్రణతో పాటు అల్లర్లు లాంటివి జరిగినప్పుడు తక్షణం రంగంలోకి దూకడానికి డ్రోన్లు దోహదపడనున్నాయి. పగటి సమయాల్లోనే కాక రాత్రిపూట కూడా అవసరాలకు తగినట్లుగా వీటిని వాడుకునే అవకాశం ఉన్నది.

వీటిని సమకూర్చుకున్న తర్వాత పోలీసు శాఖలో ఎంపిక చేసినవారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి తర్ఫీదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం డ్రోన్ల వినియోగంలో ఇటీవల పలు మార్పులు చేసి నిబంధనలను సరళతరం చేయడంతో అనుమతి పొందడం కూడా సులువైంది. తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణకు ఇప్పటికే పారా మిలటరీ బలగాలు డ్రోన్లను వాడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర పోలీసు వ్యవస్థ సైతం ఈ దిశగా దృష్టి పెట్టింది. వీటి వినియోగంతో రానున్న కాలంలో గ్రౌండ్ మీద ఉన్న పోలీసులతో సమన్వయం, తీసుకోవాల్సిన చర్యలకు ఉన్నతాధికారులకు వీలు కలుగుతుంది.


Next Story

Most Viewed