కీలక పరిణామం.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు భార్య

by Malleboina Mahesh |

వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయాడు.

కీలక పరిణామం.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు భార్య
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఈ రోజు సాయంత్రం రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు రాంబాబు ఇంటిపైకి వెళ్లి భౌతిక దాడులకు, హత్యాయత్నానికి ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుండగా, పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ నిరసనకారులను నియంత్రించడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అత్యవసరంగా 'హౌస్‌ మోషన్‌' పిటిషన్‌ను దాఖలు చేశారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ నివాసం వద్ద శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉందని, ప్రాణహాని ఉన్నప్పటికీ పోలీసులు సరైన రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటల పాటు తమకు ప్రత్యేక భద్రత కల్పించాలని, పోలీసుల వైఫల్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయంగా పెను దుమారం రేగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, ఇది ఉద్దేశపూర్వకంగా చేయించిన హత్యాయత్నమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. ప్రభుత్వం అధికారిక యంత్రాంగాన్ని వాడుకుని తమ నేతలను వేధిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసుల మోహరింపు కొనసాగుతుండగా, హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story