ఇన్వెస్టర్ల పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగించాలి.. ఏఎన్ఎంఐ!

by Disha Web Desk 17 |
ఇన్వెస్టర్ల పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగించాలి.. ఏఎన్ఎంఐ!
X

ముంబై: దేశీయ మదుపర్లు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు మరికొంత సమయం గడువు ఇవ్వాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా(ఏఎన్ఎంఐ) అభ్యర్థించింది. ఇప్పటికీ చాలామంది ఇన్వెస్టర్లు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదని, దీనివల్ల స్టాక్ మార్కెట్లలో వీరు ట్రేడింగ్ నిర్వహించలేరని ఏఎన్ఎంఐ పేర్కొంది. అంతేకాకుండా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్ల డీమాట్ ఖాతాలు సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని సెబీ హోల్ టైమ్ మెంబర్ అనంత బారువాకు రాసిన లేఖలో ఏఎన్ఎంఐ వివరించింది.

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం అనేకమార్లు గడువును పొడిగించింది. ప్రస్తుతం ఉన్న గడువును మళ్లీ పొడిగిస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువమంది ఖాతాదారులు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయలేని పక్షంలో క్లయింట్ ఖాతాలను నిలిపేస్తే స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఉంటుందని, దీనికోసం ప్రభుత్వ అధికారులతో చర్చించాలని సెబీని ఏఎన్ఎంఐ కోరింది. గడువును పొడిగించకపోతే పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యకు పరిష్కారం చూపాలని, డీమాట్ ఖాతాల సస్పెన్షన్‌ను 6 నెలలు మాత్రమే వాయిదా వేయాలని సెబీని అభ్యర్థించింది.


Next Story

Most Viewed