కుక్కపిల్లను దారుణంగా కొట్టి చంపేశారు : నటి కన్నీళ్లు

by Muthe.Rajitha |

తనకెంతో ఇష్టమైన కుక్కపిల్లను దారుణంగా కొట్టి చంపేశారని బోరున విలపించింది బాలీవుడ్ నటి మంజరీ ఫడ్నీస్.

కుక్కపిల్లను దారుణంగా కొట్టి చంపేశారు : నటి కన్నీళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : తనకెంతో ఇష్టమైన కుక్కపిల్లను దారుణంగా కొట్టి చంపేశారని బోరున విలపించింది బాలీవుడ్ నటి మంజరీ ఫడ్నీస్. ముంబైలోని రాహేజా ఎక్సోటికా సొసైటీలో నివసించే 'మైకీ' అనే కమ్యూనిటీ డాగ్‌ను కొందరు దుండగులు అత్యంత క్రూరంగా కొట్టి చంపారంటూ మంజరీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఆ మూగజీవి 2020 నుంచి ఆమె ఉంటున్న సొసైటీ ఆవరణలోనే నివసిస్తుండేదని, అయితే మే చివరి వారంలో అది అకస్మాత్తుగా అదృశ్యమవడంతో ఈ దారుణ ఉదంతం వెలుగుచూసిందని ఆమె పేర్కొన్నారు. మైకీ నిద్రపోతున్న సమయంలో ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి, అత్యంత అమానుషంగా హింసించి చంపేశారని.. ఆపై శవాన్ని ఒక బ్యాగ్‌లో కుక్కి సొసైటీ వెనుక పారేశారని ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో ఒకరు స్వయంగా అంగీకరించారని మంజరీ తీవ్ర ఆవేదనతో కన్నీరు మున్నీరవుతూ వీడియోలో వెల్లడించారు.

ఈ అమానుష ఘటనపై తీవ్రంగా స్పందించిన మంజరీ ఫడ్నీస్, దేశంలో జంతు హింసకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయని, మూగజీవులను చంపేవారికి కఠినమైన శిక్షలు పడేలా చట్టాలను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. మైకీని పొట్టనబెట్టుకున్న నిందితులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా.. జంతు ప్రేమికులు, నెటిజన్లతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మంజరీకి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తూ, నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Next Story