Prakash Raj: కేసీఆర్‌పై ప్రకాశ్ రాజ్ ప్రశంసలు.. చూసి నేర్చుకోవాలని ప్రధానికి హితవు!

by Disha Web Desk 2 |
Actor Prakash Raj Sarcastic Criticism On PM Modi
X

దిశ, వెబ్‌డెస్క్: Actor Prakash Raj Sarcastic Criticism On PM Modi| నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై సెటైర్లు వేశారు. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్స్ కోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ పేరు ప్రస్తావించకుండా డియర్ సుప్రీం లీడర్.. హైదరాబాద్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతోందని ప్రకాశ్ రాజ్ కితాబిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ పర్యటనల సందర్భంగా రోడ్లు వేయడానికి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును ఖర్చు చేస్తున్నారని, అదే ఇక్కడ ప్రజల అభివృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తారని అన్నారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో అభివృద్ధి ఎలా చేయాలో తెలంగాణలో చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కాళేశ్వరం, యాదగిరిగుట్ట, టీ-హబ్, ఆసుపత్రి, గురుకుల విద్యాలయం, సీఎం కేసీఆర్ ఫోటోను షేర్ చేశారు.

కర్ణాటక ఇష్యును ప్రస్తావించిన ప్రకాశ్ రాజ్:

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోడ్లను ప్రజలకోసం కాకుండా మీ పర్యటన సందర్భంగా వేస్తున్నారని ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఇటీవల మోడీ బెంగళూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కర్ణాటక పర్యటనకు వచ్చిన మోడీకి స్వాగత మర్యాదల కోసం బెంగళూరు అధికారులు భారీ మొత్తంలో ఖర్చు చేసుకున్నారనే వార్తలు సంచలనం రేపాయి. ఓ వ్యక్తి ఆర్టీఏ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే బీబీఎంపీ స్పందించింది. ప్రధాని రాక నేపథ్యంలో రూ.23 కోట్లు ఖర్చు చేశామని అధికారులు సమాధానం ఇచ్చారు. అందులో కొంత మొత్తం రోడ్లు వేయడానికి ఖర్చు చేయగా మిగతా మొత్తాన్ని ఇతర పనులకు వెచ్చించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇష్యూను ప్రతిపక్షాలు తీవ్ర దుమారం చేశాయి.

కేసీఆర్‌కు అనుకూలంగా ప్రకాశ్ రాజ్:

తాజాగా.. మోడీని ఉద్దేశించి పరోక్షంగా ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రకాశ్ రాజ్ కొంతకాలంగా కేసీఆర్‌తో అంటకాగుతున్నారనేది బహిరంగ రహస్యమే. దక్షిణాది రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రకాశ్ రాజ్‌కు తెలంగాణ సీఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టును, గజ్వేల్‌లో ఆయా పనులను ప్రశాంత్ కిశోర్‌తో కలిసి ప్రకాశ్ రాజ్ పరిశీలించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రకాశ్ రాజ్ పేరును నామినేట్ చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఏ మాత్రం ఛాన్స్ లభించినా 'జస్ట్ ఆస్కింగ్' ట్యాగ్ లైన్‌తో ట్విట్టర్‌లో బీజేపీ విధానాలను వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఆసక్తిని రేపుతోంది.



Next Story

Most Viewed