క్యాప్ పడిపోయిందని వెనక్కి తిరిగి చూసే లోపు..

by Disha Web Desk 13 |
క్యాప్ పడిపోయిందని వెనక్కి తిరిగి చూసే లోపు..
X

దిశ, నర్సంపేట: సరదాగా స్నేహితులతో గడపడానికి పాకాల వెళ్తున్న ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ సమ్మయ్య, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద వాడైన పల్లకొండ నరేష్(19) నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఎగ్జామ్ పూర్తయింది. దీంతో సరదాగా గడుపుదామని భావించిన నరేష్ స్నేహితులతో పాకాల వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా నరేష్ ఒత్తిడితో నిరుపేద కుటుంబానికి చెందిన అతని తల్లిదండ్రులు సరిగ్గా మూడు రోజుల కిందటే ఎన్.ఎస్ 160 పల్సర్ బైక్ ని కొనిచ్చారు. పాకాల దగ్గరలో నరేష్ క్యాప్ గాలికి ఎగిరి పోవడంతో వెనక్కి తిరిగి ముందుకు చూసేలోపే వేగంతో ఉన్న అతను చెట్టును ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో నరేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నర్సంపేట లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి డాక్టర్లు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందాడు. నరేష్ మృతితో అటు కాలేజీలో, ఇటు స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed