ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజ్‌మెంట్ కోసం 'సూపర్ యాప్'

by Disha Web Desk 7 |
ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజ్‌మెంట్ కోసం సూపర్ యాప్
X

దిశ, ఫీచర్స్ : ఇంధన ధరల్లో విపరీతమైన పెరుగుదల మూలంగా జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎకో-ఫ్రెండ్లీ కూడా కావడంతో ఈ వెహికల్స్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వాహనాల కోసం ఇండియాలో ఒక 'సూపర్ యాప్' రాబోతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించబడే ఈ యాప్.. దేశంలోని EVలకు సంబంధించిన అన్నిరకాల వస్తువులకు ఒక-స్టాప్ షాప్‌గా పనిచేయనుంది.

ఈ సూపర్ యాప్ కస్టమర్లకు చార్జింగ్ స్టేషన్ల లొకేషన్, రియల్ టైమ్‌లో వాటి లభ్యత గురించిన సమాచారాన్ని అందిస్తుంది. ప్రస్తుతం దీని రూపకల్పన కోసం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్(CESL).. ప్రైవేట్ రంగం నుంచి సమాచారాన్ని మిళితం చేస్తోంది. స్టేషన్ల లభ్యత, చార్జర్ రకాలు, టారిఫ్‌ల సమాచారాన్ని అందించనున్న యాప్ .. రాబోయే 4-6 వారాల్లో ఇది సిద్ధం కానుంది. అంతేకాదు యాప్ ద్వారా సమీప స్టేషన్స్‌లో చార్జింగ్ రిజర్వేషన్స్ కూడా చేసుకోవచ్చు.

భారత్‌లో EV డిమాండ్స్ తీర్చడమే లక్ష్యం..

వాటాదారులందరికీ మద్దతిచ్చేందుకు పరస్పర ప్రయోజనకరమైన సెటప్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా CESL మేనేజింగ్ డైరెక్టర్ మహువా ఆచార్య తెలిపారు. 'పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ నెట్‌వర్క్‌లోని సమాచారంతో పాటు OEM(ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్)లు షేర్ చేసే సమాచారాన్ని కూడా ఈ యాప్ ప్రతిబింబిస్తుంది. ప్రైవేట్ చార్జింగ్ పాయింట్స్ వద్ద విజిబిలిటీ, ట్రాఫిక్‌ను మెరుగుపరుస్తుంది. వినియోగదారులు సమీప స్టేషన్‌ల గురించిన సమాచారాన్ని వెంటనే పొందగలరు.

నీతి ఆయోగ్ 2020 నివేదిక ప్రకారం దేశంలో దాదాపు 1,827 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. అయితే రూ. 500 కోట్ల ఖర్చుతో 68 నగరాల్లో మరో 2,877 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకు భారీ పరిశ్రమల శాఖ(డీహెచ్‌ఐ) అనుమతులు జారీచేసింది. ఇక దేశంలో 400,000 ప్రైవేట్ చార్జింగ్ స్టేషన్లు అవసరముండగా.. ప్రస్తుతం 15,000-20,000 స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.

Next Story

Most Viewed