పర్యాటక రంగానికి కొత్త ఊపు.. కిన్నెరసాని అభివృద్ధికి మరో మైలురాయి!

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని అభయారణ్యం పర్యాటక రంగంలో మరో ముందడుగు వేసింది.

పర్యాటక రంగానికి కొత్త ఊపు.. కిన్నెరసాని అభివృద్ధికి మరో మైలురాయి!
X

దిశ, పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని అభయారణ్యం పర్యాటక రంగంలో మరో ముందడుగు వేసింది. ప్రకృతి సోయగాలకు నిలయమైన కిన్నెరసాని రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సఫారీ వాహనాలు కిన్నెరసానికి చేరుకున్నాయి. రాష్ట్ర స్థాయి వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ వాహనాలను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ సఫారీ సేవలు కిన్నెరసాని పర్యాటక రంగానికి కొత్త ఊపు నివ్వడమే కాకుండా, భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాదులు వేయనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రకృతి అందాలు, దట్టమైన అటవీ సంపద, అరుదైన వన్యప్రాణులు, విభిన్న జాతుల పక్షులతో ప్రత్యేక గుర్తింపు పొందిన కిన్నెరసాని అభయారణ్యం ఇప్పటికే ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణీయ కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న సఫారీ వాహనాల ద్వారా పర్యాటకులు అడవి అందాలను మరింత చేరువగా, మరింత సురక్షితంగా ఆస్వాదించే అవకాశం పొందనున్నారు. దీంతో కిన్నెరసాని పర్యాటక ప్రాధాన్యత మరింత పెరగనుంది. గత కొంతకాలంగా కిన్నెరసాని ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ట్రెక్కింగ్ మార్గాల అభివృద్ధి, బటర్‌ఫ్లై పార్క్ ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, ఫీడ్ స్టోరేజ్ షెడ్ నిర్మాణం, సందర్శకుల కోసం మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులతో పాటు సఫారీ వాహనాల ప్రారంభం కిన్నెరసాని పర్యాటక రంగానికి మరింత ఆకర్షణను తీసుకురానుంది.

సఫారీ సేవలు ప్రారంభం కావడం ద్వారా రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక వ్యాపారులు, చిన్న హోటళ్లు, రవాణా రంగం, పర్యాటక సేవలపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థికంగా లాభం చేకూరనుంది. అలాగే స్థానిక యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ప్రకృతి పరిరక్షణతో పాటు పర్యాటకాభివృద్ధి అనే ద్వంద్వ లక్ష్యంతో అటవీ శాఖ చేపడుతున్న చర్యలు కిన్నెరసాని భవిష్యత్ రూపురేఖలను మార్చే దిశగా సాగుతున్నాయి. కొత్త సఫారీ వాహనాల రాక కేవలం ఒక సేవ ప్రారంభం మాత్రమే కాకుండా, కిన్నెరసానిని రాష్ట్రంలోని ప్రముఖ ఎకో టూరిజం కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లు గా భావిస్తున్నారు. పచ్చని ప్రకృతి ఒడిలో విహరించాలనుకునే పర్యాటకులకు కిన్నెరసాని ఇకపై మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారనుంది.

Next Story