మందుబాబుల కోసం స‌రికొత్త ట్యాబ్‌లెట్‌.. అప్ప‌టికి అంతా నార్మ‌ల్‌!

by Disha Web Desk 20 |
మందుబాబుల కోసం స‌రికొత్త ట్యాబ్‌లెట్‌.. అప్ప‌టికి అంతా నార్మ‌ల్‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సాయంత్ర‌మైతే కొంద‌రికి నాలుక పీకేస్తుంటుంది. గొంతు త‌డారిపోయి, మైండ్ మ‌ద్యం మ‌త్తు కావాలంటుంది. మైకం క‌మ్మిన త‌ర్వాత కొన్ని గంట‌ల‌కు చూడాలి అవ‌స్థ‌లు.. హ్యాంగోవర్ త‌ల‌కెక్కి, క‌డుపులో దేవేస్తేన్న‌ట్లు, త‌ల గోడ‌కేసి కొట్టుకోవాల‌న్న‌ట్లు ఉంటుంది. తలనొప్పి, వాంతులు, ర‌క‌ర‌కాల ఫీలింగ్స్ ఎందుకు తాగానురా బాబోయ్‌! అనేట్లు చేస్తాయ్‌. ఇలాంటి హ్యాంగోవ‌ర్‌కు నివార‌ణ ఏమైనా ఉంటే బాగుండున‌ని అనిపిస్తుంది. ఇలాంటి వారి కోరిక‌ను తీరుస్తూ, స్వీడిష్ బ్రాండ్ Myrkl 'హ్యాంగోవర్ పిల్' ప్రవేశపెట్టింది. ఈ పిల్ తాజాగా UKలో విక్ర‌యిస్తున్నారు.

పిల్ అనేది హ్యాంగోవర్‌కి వ్య‌తిరేక సప్లిమెంట్‌. దీన్ని "ప్రీ-డ్రింకింగ్ పిల్" అని చెబుతున్నారు. ఒక్క‌ మాత్ర వేసుకుంటే, ఒక గంట తర్వాత 70% ఆల్కహాల్‌ను అది విచ్ఛిన్నం చేయగలదని Myrkl త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి 20ml ప్యూర్‌ ఆల్కహాల్ తాగితే, కేవలం 6ml మాత్రమే రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే, మ‌ద్యం కాలేయంలోకి చేరేలోపు ఆల్కహాల్‌ను కార్బన్ డయాక్సైడ్, నీటికి విచ్ఛిన్నం చేసే జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను సక్రియం చేయడం ద్వారా పిల్ హ్యాంగోవర్ రాకుండా పోరాడుతుంద‌ని కంపెనీ తెలిపింది. ప్ర‌స్తుతం UKలో, 30 పౌండ్లకు 30 మాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఈ పిల్ ఒక వరంలా అనిపించవచ్చు కానీ ప్రజలు ఈ మాత్రలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని నిపుణులు ఉటంకించారు. మద్యం సేవించి వాహనం నడపాలనుకునే వారు ఈ మాత్ర వేసుకోవడానికి ప్రయత్నించవచ్చ‌ని, అయితే, ఇది ఎప్పుడూ సురక్షితంగా ఉండకపోవచ్చని ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు. అలాగే, ఈ పిల్ ప్రజలు లిమిట్‌కు మించి తాగడానికి ఒక సాకుగా మారుతుంద‌ని కూడా ఆలోచిస్తున్నారు.



Next Story

Most Viewed