రూ.90 లక్షలకు పైగా ప్రభుత్వ ఆస్తుల అక్రమ విక్రయం పై సమగ్ర విచారణ జరపాలి

by Batti.Sumithra |

కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన ప్రభుత్వ ఆస్తులు, స్క్రాప్ సామగ్రి, కాపర్ వస్తువులు, పాత మోటార్లతో పాటు ఇతర విలువైన సామగ్రిని అక్రమంగా తరలించి విక్రయించడం ద్వారా రూ.90 లక్షలకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని 20వ వార్డు కౌన్సిలర్ కళ్లెం సావిత్రి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు.

రూ.90 లక్షలకు పైగా ప్రభుత్వ ఆస్తుల అక్రమ విక్రయం పై సమగ్ర విచారణ జరపాలి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన ప్రభుత్వ ఆస్తులు, స్క్రాప్ సామగ్రి, కాపర్ వస్తువులు, పాత మోటార్లతో పాటు ఇతర విలువైన సామగ్రిని అక్రమంగా తరలించి విక్రయించడం ద్వారా రూ.90 లక్షలకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని 20వ వార్డు కౌన్సిలర్ కళ్లెం సావిత్రి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లకు సమర్పించిన ఫిర్యాదులో వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ఫిల్టర్ బెడ్ గోదాం, బుర్ర మత్తడి, పెద్ద చెరువు ప్రాంతం, వాటర్ బెడ్ ట్యాంక్ సమీప ప్రాంతాలు, జాతీయ రహదారి పక్కన నిల్వఉంచిన స్క్రాప్ సామాగ్రి, కాపర్ వస్తువులు, పాత మోటార్లు తదితర విలువైన ప్రభుత్వ ఆస్తులను 2024 డిసెంబర్ 10వ తేదీ రాత్రి కొందరు వ్యక్తులు కూలీల సహాయంతో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా తరలించినట్లు స్థానికంగా సమాచారం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు.

ఈ ఘటన పై ఇప్పటికే 2024 డిసెంబర్ 15న మున్సిపల్ కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, డిసెంబర్ 16న మున్సిపల్ కమిషనర్‌కు, డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్‌కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పత్రికల్లో ప్రచురితమైన కథనాలు, స్థానికంగా సేకరించిన సమాచారం, అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నిల్వ ఉంచిన స్క్రాప్, ఇతర విలువైన సామగ్రిని కూడా అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇదే కాకుండా మున్సిపల్ వార్డులలో నుండి తరలించబడిన సామాగ్రి విలువ సుమారు రూ.35 లక్షలు కాగా, దీని పై కూడా కొత్త కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు గతంలో వాటర్ ఫిల్టర్ బెడ్ గోదాంలో నుండి తరలించబడిన సామగ్రి విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మొత్తం ప్రభుత్వ ఆస్తులకు రూ.90 లక్షలకు పైగా నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోందన్నారు.

ఈ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ చైర్‌పర్సన్ తో పాటు ఆమె భర్త పాత్ర పై పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయని పేర్కొన్నారు. అదేవిధంగా వాటర్ ఫిల్టర్ బెడ్ వద్ద విధులు నిర్వహించిన వాటర్ వర్క్స్ ఉద్యోగి శ్యామ్ ఇచ్చిన వాంగ్మూలంలో కూడా సంబంధిత వ్యక్తుల సమక్షంలోనే సామాగ్రి తరలింపు జరిగినట్లు వెల్లడించారని తెలిపారు. ప్రజల పన్నుల రూపంలో సమకూరిన నిధులతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా విక్రయించడం అత్యంత తీవ్రమైన అవినీతి చర్యగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కోరారు. మున్సిపాలిటీకి చెందిన స్క్రాప్, కాపర్, మోటార్లు, ఇతర సామగ్రిపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని కోరారు. గతంలో సమర్పించిన ఫిర్యాదుల పై తీసుకున్న చర్యల నివేదికను బహిర్గతం చేయాలని, అక్రమంగా తరలించబడిన ప్రభుత్వ ఆస్తులను గుర్తించి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట భారీఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కౌన్సిలర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్, కౌన్సిలర్లు అంజద్, లడ్డు, కాళ్ల రాజమణి, వనిత రామ్మోహన్, ఫాతిమా, గ్యార అఖిల, నిట్టు గంగాధర్, గోనె సునీత, తహసీన్ ఉన్నిసా, వాజిద్, ఆఫ్రిన్ సుల్తానా, ఆస్మా హబీబ్ ఖాన్, సుల్తానా బేగం, కొత్తపల్లి లలిత, మహమ్మద్ ఇసాక్ షేరు, అన్వర్ అహ్మద్, గోనే శ్రీనివాస్, ముబాషిర్, కాళ్ళ గణేష్, మాజీద్, కళ్లెం సత్యం, రామ్మోహన్, గ్యార సాయిలు, అస్రార్, జావిద్, మోతిలాల్ నాయక్, సునీత, పహిన్ సుల్తానా, 17 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story