పాక్‌ మసీదులో బాంబు పేలుళ్లు.. 30 మంది మృతి, 50 మందికి గాయాలు,10 మంది పరిస్థితి విషమం

by Disha Web Desk 17 |
పాక్‌ మసీదులో బాంబు పేలుళ్లు.. 30 మంది మృతి, 50 మందికి గాయాలు,10 మంది పరిస్థితి విషమం
X

పెషావర్ : దాయాది దేశం పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శుక్రవారం పవిత్రమైన రోజు కావడంతో ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లిన జనాలను లక్ష్యంగా చేసుకుని నెత్తుటేర్లు పారించారు. పెషావర్‌లోని జామియా మసీదులో ఒక్కసారిగా పేలుడు సంభవించగా 30 మంది అమాయకపు ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని లేడి రీడింగ్ ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. అయితే, జామియా మసీదులో పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. మసీదులోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టులు దాని ప్రాంగణంలో గల జనావాసాల మధ్య ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పాక్ దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. పేలుడు ధాటికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడి భయంతో పరుగులు తీయగా, మసీదు చుట్టు పక్కల పేలుడులో మరణించిన వారి మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా పడ్డాయి.




Next Story

Most Viewed