వెలిమినేడుపై 'ఫార్మా' పంజా.. రోగాల బారిన ప్రజలు

by Disha Web |
వెలిమినేడుపై ఫార్మా పంజా.. రోగాల బారిన ప్రజలు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : అది హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి. దాన్ని ఆనుకునే వెలిమినేడు గ్రామం ఉంది. ఈ గ్రామం ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎందుకనుకుంటున్నారా.. ఇక్కడ ఫార్మా కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఫలితంగా ఆ గ్రామం కొద్దిరోజుల్లోనే కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయింది. ఆ గ్రామం చుట్టుపక్కలా వారిని ఎవ్వరినీ మందలించినా.. ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుండడం పరిపాటి. ఇది కార్పొరేట్ మాయజాలమా.. పాలకుల నిర్లక్ష్యమా.. అన్న సంగతి వారికే తెలియాలి. వాస్తవానికి కొత్త ఫార్మా కంపెనీ స్థాపిస్తే.. మెడిసిన్ అందుబాటులోకి వస్తుందని ఎగిరిగంతేస్తారు. కానీ మరోవైపు ఆ కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలతో జరిగే నష్టం అంతాఇంతా కాదనే చెప్పాలి. కంపెనీల సమీపంలోని ప్రజలు... జల, వాయు కాలుష్యంతో కీళ్లనొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యలతో పాటూ అంతుచిక్కని వ్యాధులతో అవస్థలు పడుతున్నారు.

వ్యర్థాల పారబోత.. అంతుచిక్కని వ్యాధులు..

ఫార్మా కంపెనీల ప్రభావం ప్రజలపైనే కాదు.. జీవరాశులపైనా విపరీతంగా పడుతోంది. కంపెనీలు వ్యర్థాలను భూమిలోకి వదలడంతో ఇక్కడి భూగర్భజలాలు కలుషితమై పండిన గడ్డిని తిని ఆవులు, గేదెల్లో గర్భం - చూడి నిలవడం లేదు. దీంతో మూగజీవాలను సాకడం భారంగా మారడంతో రైతులు వాటిని కబేళాలలకు అమ్మేస్తున్నారు. ఫార్మా కంపెనీల కాలుష్యంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ గ్రామాల్లోని అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి సైతం ఎవరూ ముందుకు రావడం లేదంటే అతిశయోక్తి కాదు..

జాడే లేని వ్యర్థాల రీస్లైకింగ్ ప్లాంట్

నిజానికి ఫార్మా కంపెనీలు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లోకి వదలొద్దు. వాటికోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా మెడిసిన్ ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా విడుదలయ్యే వ్యర్థాలను నిల్వ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఫార్మా కంపెనీలు పట్టించుకోవడం లేదు. కాలుష్యకరమైన వ్యర్థాలను భూగర్భంలోకి వదలడం, లేదంటే హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న నీటి కుంటల్లో పారబోస్తున్నారు. దీంతో కుంటలు, చెరువుల్లో ఉన్న చేపలు మృత్యువాతపడుతున్నాయి. గతంలో ఫార్మా వ్యర్థాలను చెరువులోకి వదలడంతో చిట్యాల మండలం వెలిమినేడు చెరువులోని చేపలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అంతకుముందు డిసెంబరు నెలలో ఇదే మండలంలోని గుండ్రాంపల్లి చెరువులో రూ.15 లక్షల విలువైన చేపలు కాలుష్యంతో చనిపోవడంతో ఇక్కడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయిన సంగతి గుర్తు చేసుకోవాల్సిందే.

పనికిరాని భూములు..

ఫార్మా కంపెనీల పుణ్యమంటూ వెలిమినేడు చుట్టుపక్కలా పంటభూములన్నీ బీళ్లుగా మారే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే అక్కడి పంట పొలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫార్మా కంపెనీలు యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను వదలడంతో అవి భూమిలోకి ఇంకి పంట దిగుబడులు తగ్గడమే కాకుండా.. పంట ఉత్పత్తులు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. బోర్ల నుంచి వస్తున్న నీరు పూర్తిగా రసాయనాలతో నిండిపోయింది. నీటిలో నురగలు, తెట్టు ఏర్పడుతోంది. వరి వేస్తే దిగుబడులు రావడం లేదని, పత్తి పంట ఎదుగుదలలో లోపం వస్తో్ందని, వేరుశనగ పంట తొలిదశలోనే మాడిపోతోందని రైతాంగం గగ్గోలు పెడుతోంది. మరికొంత కాలం ఫార్మా కంపెనీలు ఇదే తరహాలో కొనసాగితే.. భూములు ఏ పంట వేసేందుకు పనికిరావనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా ఫార్మా కంపెనీలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొరఢా ఝులిపించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed