ఎన్నికల రిజర్వేషన్ల వివాదం.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హింసాత్మక ఘర్షణల్లో 11 మంది దుర్మరణం

by Malleboina Mahesh |   (  Updated:2026-06-09 08:07:50  IST  )

ఎన్నికల రిజర్వేషన్ల వివాదం కారణంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హింసాత్మక ఘర్షణలు చోటే చేసుకొని 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎన్నికల రిజర్వేషన్ల వివాదం.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హింసాత్మక ఘర్షణల్లో 11 మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జూలై 27న జరగబోయే PoK శాసనసభ ఎన్నికలలో, స్థానికేతర శరణార్థుల కోసం 12 సీట్లను రిజర్వ్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తమ స్థానిక హక్కులు దెబ్బతింటాయని వారు ఆందోళన చెందుతూ నిరసనలకు పిలుపునిచ్చారు. 'జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామి యాక్షన్ కమిటీ' (JAAC) ఆధ్వర్యంలో ఉధృత నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో, గతంలో జరిగిన ఘర్షణల్లో మరణించిన ఒక నిరసనకారుడి అంత్యక్రియల వేళ హాస్పిటల్ వెలుపల గుమికూడిన వేలాది మందిపై పాక్ పోలీసులు, పారామిలటరీ దళాలు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ దారుణ కాల్పులు, ఎదురుదాడి ఫలితంగా కనీసం 11 మంది (7 గురు పౌరులు, 4 గురు పోలీసులు) అక్కడికక్కడే మరణించగా, 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని స్థానిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఈ హింసాత్మక ఘటనా పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి హై అలర్ట్ ప్రకటించింది. తమ కనీస అవసరాలైన గోధుమలు, విద్యుత్ సబ్సిడీలను పక్కనపెట్టి, తమ రాజకీయ హక్కులను కాలరాస్తూ పాక్ సైన్యం సామాన్య పౌరులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ పౌరులెవరూ ప్రస్తుతానికి PoK ప్రాంతంలో పర్యటించవద్దంటూ అత్యవసర ‘ట్రావెల్ అడ్వైజరీ’ (హెచ్చరికలు) జారీ చేశాయి. ఈ ఉద్రిక్తతల మధ్య జూన్ 9 (మంగళవారం) నాడు భారీ బంద్‌కు నిరసనకారులు పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story