తెలుగు అకాడమీ కేసు: మరోసారి కస్టడీకి ఇవ్వండి

by  |
Telugu-Academy
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు అకాడమీ కేసులో అరెస్టయినవారిలో తొమ్మిది మంది పోలీస్ కస్టడీ మంగళవారం ముగిసింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా అరెస్టయ్యి జైల్లో ఉన్న వినయ్‌కుమార్, భూపతి, రమణారెడ్డి తదితర మరో నలుగురిని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నెల 16వ తేదీ తర్వాత తీసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అకాడమీకి చెందిన రూ. 64 కోట్ల గోల్‌మాల్ వ్యవహారంలో సాయికుమార్ అనే వ్యక్తి కీలక భూమిక పోషించినట్లు నిర్ధారించుకున్న పోలీసులు గతంలో అతనిపై నమోదైన కేసుల వివరాలను సేకరించారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హౌజింగ్ కార్పొరేషన్‌కు చెందిన రూ. 40 కోట్లు, సీడ్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ. 15 కోట్లు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన రూ. 15 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన రూ. 45 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్నదని తెలుసుకున్నారు. ఈ రెండు కేసుల విషయంపై పూర్తి వివరాలను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి కొత్తగా రెండు కేసుల్ని నమోదు చేసేందుకు సహకారం కోరారు. త్వరలో కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గడిచిన పన్నెండేళ్ళలో సుమారు రూ. 200 కోట్ల మేర నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. మరోవైపు తెలుగు అకాడమీకి చెందిన నిధులు దారిమళ్లడంతో వాటిని రికవరీ చేయడంపై పోలీసులు దృష్టి సారించారు.


Next Story

Most Viewed