ఎన్నికల టైంలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. నోరెత్తకుండా చేసిన మొదటి ఇష్యూ ఇదే!

by GSrikanth |
ఎన్నికల టైంలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. నోరెత్తకుండా చేసిన మొదటి ఇష్యూ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న బీఆర్ఎస్‌కు అవే సంకటంగా మారుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు సృష్టించింది తానేనంటూ స్వయంగా కేసీఆర్ చెప్పుకున్నా ఇప్పుడు అలాంటి పథకాలే ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలుకాకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దళితబంధు అందనివారు ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు. రూ.లక్ష సాయంపైనా బీసీలు గుర్రుగా ఉన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అందలేదంటూ గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు. లబ్ధి పొందినవారి సంగతి ఎలా ఉన్నా.. వాటిని అందుకోలేకపోయినవారంతా అధికార పార్టీపై ఫైర్ అవుతున్నారు. దళితబంధుతో దళితుల ఓట్లు పడతాయనుకున్నా అది మొక్కుబడి స్కీమ్‌గా మిగిలిపోయింది. రెండేండ్లుగా అమలుకు నోచుకోవడం లేదని, అది కేవలం ప్రచార ఆర్భాటమేనని ఆ సెక్షన్ ప్రజలు గ్రహించారు. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల చేతుల్లో ఉండడంతో కమిషన్లు వసూలు చేశారన్న ఆగ్రహం లబ్ధిదారుల్లో, దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఆ ఎమ్మెల్యేలే ఇప్పుడు అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండడంతో ప్రజల్లో ఆవేశం మరింత పెరిగినట్లయింది.

రైతుల్లోనూ వ్యతిరేకత

రైతుబంధు స్కీమ్‌ దేశంలో ఎక్కడా లేదని, ఐక్యరాజ్య సమితి సైతం దానిని ప్రశంసించిందంటూ కేసీఆర్ పదేపదే గొప్పగా చెప్తున్నారు. కానీ కౌలు రైతులకు ఇది వర్తించకపోవడంతో ఆ సెక్షన్ వారంతా అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు భూస్వాములకూ ఈ స్కీం పేరుతో రూ.లక్షలు గుమ్మరిస్తున్నారని, వారి కోసమే ఈ పథకాన్ని తెచ్చారనే అసంతృప్తి చిన్న, సన్నకారు రైతుల్లో మొదటి నుంచీ వ్యక్తమవుతున్నది. రుణమాఫీ సైతం ఇప్పటికీ పూర్తికాలేదు. దీనికి తోడు తాజాగా బీఆర్ఎస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో రుణమాఫీ హామీ కనిపించలేదు. దీన్ని ఒక వెలితిగానే రైతులు భావిస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో కేసీఆర్‌పైన గతంలో ఉన్నంత నమ్మకాన్ని ఇప్పుడు రైతులు వ్యక్తం చేయడంలేదు. కాంగ్రెస్ పార్టీ గతేడాది వరంగల్ డిక్లరేషన్‌లో, ఇటీవల సిక్స్ గ్యారెంటీస్‌లో హామీ ఇచ్చిన తర్వాత కేసీఆర్ రైతుబంధు పెంచక తప్పలేదని రైతులు గ్రహించారు. కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వకుంటే కేసీఆర్ సాయాన్ని పెంచేవారు కాదన్న అనుమానం వారిలో వ్యక్తమవుతున్నది. వడ్లను మార్కెట్‌లో అమ్ముకోవడంలో ఎదురవుతున్న చిక్కులు, తేమ పేరుతో కోత పెట్టడం, సకాలంలో డబ్బులను చెల్లించకపోవడం, వరదలకు పంట నష్టపోతే హామీ ఇచ్చినా సాయం అందించకపోవడం.. ఇవన్నీ రైతుల్లో కనిపించకుండానే బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతి క్వింటాల్ వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీ రైతులను ఆ దిశగా డ్రైవ్ చేస్తున్నది.

వివాదంలో 24 గంటల విద్యుత్

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు ఫ్రీగా 24 గంటల పాటు కరెంటును అందిస్తున్నామని సీఎం కేసీఆర్ సహా మంత్రులు, బీఆర్ఎస్ నేతలంతా ప్రతి బహిరంగసభలో గొప్పగా చెప్పుకుంటున్నారు. రోజుకు ఎన్ని గంటలు కరెంటు వస్తున్నదో రైతులకు స్వీయానుభవం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరులో 8-14 గంటలు మాత్రమే వస్తున్నదనేది రైతులు చెప్తున్న మాట. విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర కొన్ని ప్రాంతాల్లో జరిగిన ధర్నాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి లాగ్‌బుక్‌లలో రికార్డయిన లెక్కలను బహిర్గతం చేశారు. ఊహించని తీరులో నిజం బయటకు రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో లోకల్‌గా ఉన్న ఇంజనీర్లు లాగ్‌బుక్‌లలోని వివరాలు బయటకు పొక్కకుండా గోప్యంగా పెట్టారు. వాస్తవానికి భిన్నంగా తప్పుడు లెక్కలతో అధికార పార్టీ నేతలు గంభీర ఉపన్యాసాలు ఇస్తున్నారని రైతులకు అర్థమైంది. కాంగ్రెస్ వైపు రైతులు మళ్లకుండా ఉండేందుకు హస్తం పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రైతులను కొడంగల్ లాంటి ప్రాంతాలకు రప్పించి అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని, కరెంటు రావడంలేదని ఇక్కడ రైతుల్లో కన్‌ప్యూజన్ సృష్టించే ప్రోగ్రామ్‌కు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఈ రహస్యం ఆ రైతుల మాటల ద్వారానే బయటకు వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు డిఫెన్సులో పడిపోయారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సవాలు విసిరి బస్సులను ఏర్పాటు చేస్తానని, వచ్చి స్వయంగా గ్యారెంటీలు అమలవుతున్నాయో లేదో చూసుకుని వెళ్లండంటూ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో గులాబీ నేతలు సైలెంట్ అయిపోయారు.

ప్రశ్నార్థకంగా బీసీ బంధు, గృహలక్ష్మి

దళితులకు తలా రూ.10 లక్షల సాయం చేసి బీసీ బంధుకు మాత్రం కేవలం రూ.లక్షకే పరిమితం చేయడం కూడా వెనకబడిన కులాల్లో ఆగ్రహం తెప్పించింది. గౌడ్, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి తదితర కులాలకు ఈ సాయం అందకపోవడంతో ఆ సెక్షన్ ప్రజల్లో నిరాశ నెలకొంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్భాటంగా చేతివృత్తులకు చేయూత పేరుతో ఈ స్కీమ్‌ను ప్రారంభించినా అది దరఖాస్తులకే పరిమితమైంది. సొంత జాగ ఉండి ఇల్లు లేనివారికి గృహలక్ష్మి స్కీమ్‌తో రూ.3 లక్షల సాయం చేస్తామనే హామీ కూడా దరఖాస్తుల దగ్గరే ఆగిపోయింది. హామీలు ఇవ్వడం.. గొప్పగా చెప్పుకోవడమే తప్ప గ్రౌండింగ్ కావడంలేదనే అసంతృప్తి బీసీలతో పాటు అల్పాదాయ వర్గాల్లో బలంగా నాటుకుపోయింది.

ప్రవళిక, మేడిగడ్డ ఘటనలు బ్యాక్‌ఫైర్

ప్రవళిక సూసైడ్ ఇష్యూలో బీఆర్ఎస్ వేసిన ప్లాన్ రివర్స్ కొట్టింది. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రవళిక క్యారెక్టర్‌నే అధికార పార్టీ డ్యామేజ్ చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నిరుద్యోగుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు ప్రవళిక తల్లి, సోదరుడితో వీడియో నోట్‌లను రిలీజ్ చేయించడం, వారిని స్వయంగా కేటీఆర్ పిలిపించుకుని ప్రభుత్వ ఉద్యోగ హామీ, ఆర్థిక తోడ్పాటు భరోసా ఇచ్చి వారి నోరు మూయించారనే నిందనూ మోయాల్సి వచ్చింది. టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు పేపర్ లీకేజీ, పరీక్షల రద్దు, వాయిదాలు.. ఇలాంటి నిర్ణయాలతో లాజికల్ ఎండ్‌కు వెళ్లడంలేదని, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదనే అపవాదును బీఆర్ఎస్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా, కేసీఆర్ మానస పుత్రికగా ఇంతకాలం బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఆ ఇష్యూపై గులాబీ నేతలు బహిరంగంగా మాట్లాడడానికీ సాహసించడంలేదు. చిన్న పొరపాట్లు సహజమేనంటూ కేటీఆర్, ఇంజనీర్లు చెప్పుకుంటున్నారు. కానీ రూ.వేలాది కోట్లు ఖర్చు చేసిన కట్టిన ప్రాజెక్టుకు ప్రారంభ లింకుగా ఉన్న మేడిగడ్డ దగ్గరే నిర్మాణ నాణ్యత ప్రశ్నార్థకం కావడంతో బీఆర్ఎస్‌పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. ఇక్కడ కూడా ప్రవళిక సూసైడ్ ఇష్యూ తరహాలోనే వాస్తవాలను బయటకు పొక్కకుండా గులాబీ పార్టీ తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ఆ పార్టీపై నెగెటివ్ పెరగడానికి కారణమైంది.

నిలదీస్తున్న ఓటర్లు

‘సంక్షేమ పథకాలు చేరని ఇల్లు లేదు.. విపక్షాల నేతలకూ అందుతున్నాయి.. అవే మాకు బలమైన ఓటు బ్యాంకు..’ అని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నా అవి అరకొరగా అమలుకావడం, కమిషన్లకు ఎమ్మెల్యేలు కక్కుర్తిపడడం నెగెటివ్‌గా మారిపోయింది. ఇప్పుడు అమలవుతున్న స్కీములు బీఆర్ఎస్‌కు మాత్రమే పరిమితం కావని, మరో పార్టీకి అధికారంలోకి వచ్చినా అవి కంటిన్యూ అవుతాయంటగదా.. అనే పబ్లిక్ టాక్ అధికార పార్టీ అభ్యర్థులకు సంకటంగా మారింది. ఏ పథకాలు కాపాడతాయని బీఆర్ఎస్ ధీమాగా ఉన్నదో ఆ పథకాలు అసంపూర్ణంగా ఉండడమే ఆ పార్టీకి అతి పెద్ద అడ్డంకిగా మారాయి. ప్రభుత్వ వైఫల్యమే బీఆర్ఎస్‌కు ప్రతిబంధకంగా మారుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచార సమయంలో పథకాల అమలు‌పైనే ఓటర్లు నిలదీస్తున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, తుంగతుర్తి, చెన్నూరు, సూర్యాపేట, ఆందోల్, పెద్దపల్లి, మంచిర్యాల, వర్ధన్నపేట.. ఇలా అనేక నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఊహించని విధంగా ప్రశ్నలు రావడంతో సమాధానం చెప్పుకోలేక అధికార పార్టీ అభ్యర్థులు తిరుగుముఖం పడుతున్నారు.

Next Story

Most Viewed