కవిత కంటే ముందే కేటీఆర్‌ జైలుకెళ్లినా ఆశ్చర్యం అవసరం లేదు: ఎంపీ అర్వింద్

by Disha Web Desk 2 |
కవిత కంటే ముందే కేటీఆర్‌ జైలుకెళ్లినా ఆశ్చర్యం అవసరం లేదు: ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మూడు దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న పసుపు బోర్డు ఏర్పాటుపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట ప్రకటన రావడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని ప్రకటన నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద సంబురాలు నిర్వహించారు. పసుపు రైతులతో కలిసి పసుపు హోలీ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. రైతులు పసుపు బోర్డు ఏర్పాటుతో చాలా ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ పాలమూరులో ప్రధాని మోడీ ప్రకటన చేయడంతో తాను ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్కు మోడీ స్పందించడం తనకు మిక్కిలి ఆనందాన్ని కలిగించిందన్నారు. మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానికి చేసిన ట్వీట్‌కు ప్రధాని రీట్వీట్ చేశారని గుర్తు చేశారు. ట్వీట్‌లో రైతుల శ్రేయస్సు సామర్థ్యాలు మనకు ముఖ్యం అని మోడీ అన్నారు. పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ఏమైనా చేస్తాం ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించారని అన్నారు. పసుపు బోర్డు వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అని గుర్తుచేశారు. ప్రధాని మోడీ పాలమూరులో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు.

కేటీఆర్ తన తండ్రి పేరును రాష్ట్రంలో డ్రగ్స్ సేవనంలో ముందుంచి పేరు నిలబెట్టారని విమర్శించారు. నిజామాబాద్‌కు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గంజాయి మార్కెటింగ్ సేల్స్ మేనేజర్‌గా పనికొస్తారని ఎంపీ వ్యాఖ్యానించారు. మోడీని ప్రపంచం కీర్తిస్తుందని జీ20 దేశాల సదస్సు నిర్వహణతో భారత దేశ ఖ్యాతి దశదిశలా వ్యాపించిందన్నారు. కేటీఆర్, కవితలు తెలంగాణ ఉద్యమంలో లేరని, ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుందన్నారు. అంతేకాదు.. కవిత కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదని తెలిపారు.



Next Story

Most Viewed