ఎమ్మెల్యే రేఖానాయక్‌ మీద కోపంతో అల్లుడికి సర్కార్ ఝలక్!

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యే రేఖానాయక్‌ మీద కోపంతో అల్లుడికి సర్కార్ ఝలక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖానాపూర్ బీఆర్ఎస్‌లో రేఖానాయక్ డెసిషన్ దుమారం రేపుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనను కాదని కేటీఆర్ మిత్రుడు జాన్సన్ నాయక్‌కు టికెట్ కేటాయించడంపై ఆమె తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ దక్కకపోవడంతో అధికార పార్టీ సంగతి చూస్తానంటూ ఆమె ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో అత్త మీద కోపం.. అల్లుడిపై పడినట్లయింది ఆమె తీరు. రేఖానాయక్ అల్లుడు శరత్‌చంద్ర పవార్‌పై సర్కార్ బదిలీ వేటు వేసింది. అయితే కాంగ్రెస్‌లో చేరుతానని ఇవాళ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఆమె స్పష్టం చేశారు. రేఖానాయక్ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె కూతురి భర్తపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం వెనుక రాజకీయ కక్షసాధింపు చర్యలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రాధాన్యత లేని పోస్టులోకి..

రేఖానాయక్ అల్లుడు శరత్‌చంద్ర పవార్ ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్‌ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వేళ రేఖానాయక్ అల్లుడిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేసి.. ఎన్నికల వ్యవహారాలతో సంబంధం లేని పోస్ట్‌ ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వైఖరి చూస్తుంటే అత్తమీద కోపం అల్లుడిపై చూపిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

బీఆర్ఎస్ నన్ను పక్కన పెట్టింది: ఎమ్మెల్యే

తన పార్టీ మార్పు విషయంలో రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనను బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవీకాలం ముగిసే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనని.. కానీ తనను పక్కన పెట్టిన పార్టీలో ఎలా పని చేయాలని ప్రశ్నించారు. తన టర్మ్ పూర్తయ్యక కచ్చితంగా పార్టీ మారుతానన్నారు.

Next Story